పుట:హంసవింశతి.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క. ఈ లీలఁ బురము లోపల
మేలౌ ప్రాయంపు రూపు మీటగు బారిం
జాలి భయ లజ్జ లన్నియుఁ
దూలి చనన్ వెన్నుఁ జఱచి తొలఁగక కలయున్. 221

వ. ఇత్తెఱంగున. 222

చ. చవిఁగొని జారవీరరతిసౌఖ్యము దెప్పలఁదేల నెప్పుడున్
దివురుచు మోహవార్ధిని మునింగి యొకానొక కాలమందునన్
శివశివ! కాపురంబుపయిఁ జింత యొకింతయు లేక చిత్తసం
భపు నిజమాయ గప్పి కలఁపం దలవాకిట నుండు నెప్పుడున్. 223

శా. ఈ మర్యాదను గొన్నినాళ్ళు చనఁగా హెచ్చైన కార్యానకై
భూమీశుం డొకనాఁడు పొమ్మినినచో ఫూత్కారుఁడై యీగతిన్
“స్వామీ! కట్టడఁజేసితే” యనుచుఁ “జీ! జన్మం బిదే” లంచుఁ జిం
తామగ్నముఁ జెంది మందిరములోనం జేరి పెండ్లాముతోన్. 224

వ. అసహాయుం డిట్లనియె. 225

తే. భూవరుం డొక్క పయనంబు పొమ్మటన్న
మంచిదని వచ్చితిని సమ్మతించి నేడు
సంబళము, కంబళము, కత్తి, చద్ది, చల్ల
డంబు, కేడెండు, ధట్టి తెమ్మంబుజాక్షి! 226

క. అని పల్కరించి నప్పుడె
ఘనకుంతల “తొడుసువాసెఁ గదరా” యని యిం
పొనర నవి యిచ్చి పనిచినఁ
జనె నాతఁడు పయనమయి విచారముతోడన్. 227

వ. అట్లసహాయుం డరిగిన పిమ్మట. 228