పుట:హంసవింశతి.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



రోలు రోఁకలికంచు రూఢిగా నిల్లీల్లు
దిరుగు నేప్రొద్దుఁ దత్తరముతోడఁ
గూరగాయల కంచుఁ గోరి తా బాజారు
కును మఱిమఱి నేఁగుఁ గొమరుతోడఁ
బరిలేని పనిజోలిఁ గొని వాడవాడలఁ
జరియించు సారె కచ్చెరువుతోడఁ
తే. బోలికల నెంచు వలరాచ పొగరు నిగుడఁ
గులుకుఁ బ్రాయంపు నెఱనీటు కోడెకాండ్ర
గమికిఁ దన జగ్గు జిగి సంచకార మొసఁగి
వలపు రెట్టింప మెలఁగు నవ్వనజగంధి.

క. తన కంటికిఁ బ్రియమయ్యెడు
ఘను నొక్కని వెంటనంటి కౌతుక మొప్పన్
మనసంటి కౌఁగిలింపక
చన దింటికి దాని బల్వ్యసన మేమంచున్!

సీ. ఆసువోసెడు దాని హస్తంబురీతిని
గుంచె దీసెడు దాని కొమరు మిగుల
జడ చిక్కు దయ్యంబు చందంబునను జెట్టు
విడిచిన భూతంబు కడఁక తోడ
మద్దెలలో నెల్క మర్యాద, నర్థార్జ
నాసక్తిఁ దిరుగు సన్న్యాసిమాడ్కి
వల్లంబు పోనాడు వైశ్యుని ఠేవను
గాలు గాలిన పిల్లి క్రమము దోఁపఁ
తే. గంతుమాయల నుమ్మెత్తకాయఁ దినిన
వెఱ్ఱితెఱఁగున వ్యసనంపు వెఱ్ఱి వొడమి
చికిలి నెఱ వన్నెకాండ్రకు సివములెత్త
నెవనసి చరియించు వీఁట నాహేమరేఖ.