పుట:హంసవింశతి.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నెసఁగు నసగూఁటి పిసవెఱ్ఱి కసరు రేఁగి
జారవాంఛావిహారంబు సలుపసాఁగె. 214

చ. విటులకుఁ గొంగుబంగరము, వేడుకకాండ్రకుఁ బట్టుగొన్ము యు
త్కటతరమన్మథార్తులకుఁ గల్పకుజంబు, భుజంగకోటికిన్
ఘటితనిధానసీమ, యుపకాంతుల చేరువపంట, జారస
త్పటలికిఁ బంచదార యను దానివిలాస మయారె! యారయన్. 215

సీ. కుఱుమాపు మైనున్న కఱలచీరటువిప్పి
చెలువైన సరిగంచు చీరఁ గట్టు
మెఱుఁగంచుకమ్మలు దొరయవం చటుడించి
మణుల రంజిల్లు కమ్మలు ధరించుఁ
[1]జిటి పొటి సొమ్ములు దీసి మెఱుంగు కట్టాణి
పూసల హారముల్ పొసఁగఁ దాల్చు
గుత్తంపు రవికఁ దా హత్తకుండఁగఁ జేసి
కలపంబు కులుకు గుబ్బలను బూయు
తే. నడర బెడఁగైన నిడువాలు జడ సడల్చి
కుప్పె గన్పడ సవరంపుఁ గొప్పుఁ బెట్టు
మరియు ముంగిట నిలుచుండి మొలకనగవు
లెసఁగ విటభాగ్యరేఖ యా హేమరేఖ. 216

చ. కిలకిల నవ్వు, మోవి పలుగెంటుల దీటుఁ గుచంబులోరఁగా
వెలువడఁ బైఁటవేయు, నెఱవింతగఁగేరు, మరుల్కొనంగ, బె
ళ్కులు గొనఁజూచు, లేని వగలుంగొని, మాటికిఁ గుల్కుఁ, గోటి చి
మ్ములు నొనరించు నవ్వెలఁది మోహపుఁబ్రాయమువానిఁ జూచినన్. 217

సీ. ఏటినీటి కటంచుఁ బాటిపంటెత్తుక
పలుమాఱు దిరుగు నిబ్బరముతోడ

  1. ఇచటి ఛందోనియమభంగము చింత్యము.