పుట:హంసవింశతి.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైజయంత వితాన వైజయంత వితాన
భూషణంబు నృపాల భీషణంబు
భాసమాన శశిప్రభాసమాన క్షౌమ
సుందరంబు కిరాటమందిరంబు
సుమనస్స్తుతోద్దామ సుమనస్స్తుతారామ
బంధురం బురుశూద్రసింధురంబు
తే. సతతబహువైభవాసదృశప్రభావ
కీర్తిరాజితకుండలీకృతసుధీర
వజ్రమణిదీప్తవప్రాంశువలయలలిత
గోపురంబై రహించుఁ గాశీపురంబు. 162

ఉ. ఆ పుటభేదనేంద్ర దృషదావళి కల్పితగోపురాశిపై
నేపున మాపు ఱేపుఁ జను నిందు దినేంద్రులఁ బర్వఁ దద్ద్యుతుల్
బాపురె! వీనికిన్ గ్రహణబాధ యపర్వములందు నేక్రియన్
బ్రాపిత మయ్యె నంచు మది భ్రాంతి వహింతురు తాంత్రికోత్తముల్. 163

తే. అట్టి పుణ్యస్థలంబున కరిగి వేడ్క
గడలుకొన మణికర్ణికాఘట్టమునను
నిలిచి జలకచ్ఛమున స్నాననిష్ఠఁ బూని
వెడి మాధ్యాహ్నికక్రియల్ వేగఁ దీర్చి. 164

క. మణికర్ణిక మణికర్ణిక
మణికర్ణిక యనుచు నుడువు మనుజుల కెల్లన్
గణనాతీతపు దోషము
లణఁగి శతక్రతుఫలంబు లగునని తలఁచెన్. 165

వ. అంతట నవ్వటుశిఖామణి నమకచమకంబుల రుద్రన్యాసయుక్తంబుగా విశ్వేశ్వరు నభిషిక్తుం జేసి పూజించి ప్రదక్షిణనమస్కారంబులు గావించి యిట్లని స్తుతియించె. 166