పుట:హంసవింశతి.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బమ్మెర రొప్పుచుండఁగను బాంధవు లెల్లను గాంచియుండఁగాఁ
గొమ్మరొ! యిట్టికార్య మొనఁగూడునె? కూడిన హాని చెందదే? 99

తే. అనిన హేమావతికి నిట్టు లనియె హేల
రేపటికి నేఁటి ప్రాయంపుటేపు గలదె?
మోహ మెక్కొనఁ జక్కని ముద్దుజాణ
యొకని బిగికౌఁగిఁటను జేర్చి యుండవలయు. 100

క. ఎక్కడి మగఁ డెక్కడ సఖు
లెక్కడి నీయత్తమామ లెక్కడి చుట్టా
లిక్కొలఁది దొడ్డ కొంచెము
లెక్కింపకు మరుని హావళిన్‌ బడువేళన్. 101

సీ. కోటగోడలనైన మీటుగా నెగఁబ్రాకి
దాఁట నేరని దేటి తలిరుఁబోఁడి
ఘుమఘుమార్భటితోడ ఘోషించు నదులైన
నీఁది పోవని దేటి యెమ్మెలాఁడి
తనమీఁది తప్పు నొక్కనిమీఁద నిజముగాఁ
బెట్టనేరని దేటి బిసరుహాక్షి
ధవుఁడైనఁ దనజాడ తగదని పట్టిన
నిర్వహింపని దేటి నీటుకత్తె
తే. తలవరులు గన్నచో లేని తాల్మిఁబూవి
బొంకు తథ్యంబు తథ్యంబు బొంకుఁ గాఁగ
నెంచి యుపనాథుతోడఁ గ్రీడించి మించి
చక్కటికిఁ దేని దది యేటి సరసురాలు. 102

వ. అని మఱియు బోధింప నంగంబు పులకాంకురానుషంగంబుగా నిజాంతరంగంబునం బొడము వ్రీడాభరం బుడిపికొని దరస్మితానతముఖాంబుజ