సూతపురాణము
ద్వితీయాశ్వాసము.
జోతలు.
చం. మలమలమాడు పొట్ట, తెగ ♦ మాసినబట్ట, కలంత పెట్టఁగా
విలవిలయేడ్చుచున్న నిఱు ♦ పేదకు జాలినిఁ జూపకుండ, ను
త్తలపడిపోయి జీవరహి ♦ తంబగు బొమ్మకు నిండ్లువాకిళుల్
పొలమును బొట్రనిచ్చెడి ప్ర ♦ బుద్ధవదాన్యుల నిచ్చ మెచ్చెదన్. 1
ఉ. చేసిన దోసమీశ్వరుని ♦ చింతనచే నశియించునన్న వి
శ్వాసము కల్గి రేఁబవలు, ♦ పాపమొనర్చుచుఁ దీరినప్పుడే
దోసమయంబునం గలముఁ ♦ దొందరగాఁగొని రామకోటినిన్
వ్రాసెడి భక్తకోటిపద ♦ పంకజముల్ శరణంబు వేడెదన్. 2
ఉ. కామపరీతబుద్ధి గుణ ♦ కర్మపరీక్షను మాని బ్రాహ్మణ
స్వాములఁ జేసి కొందఱిని ♦ బానిసలం బొనరించి కొందఱిన్
బూమెలుచెప్పి యీభరత ♦ భూమిఁగలంచెడి వర్తమానహిం
దూమత సంప్రదాయమును ♦ దోసిలియొగ్గి భజింతునిచ్చలున్. 3
ఉ. పొచ్చెములేని మిండతల ♦ పొత్తయినన్ బహు పాపమంచు వా
క్రుచ్చుచు నాలిమ్రుచ్చులయి ♦ కొక్కిరి వేలుపు నాగవాస మం
దిచ్చెడి కమ్మతావిగల ♦ యెంగిలిభాగల మీఁది పేర్మిచేఁ
గ్రచ్చఱ యజ్ఞముల్ సలుపు ♦ బ్రాహ్మణదీక్షితులన్ స్మరించెదన్. 4