Jump to content

పుట:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


కం. పరిశుద్ధతోయమయమై
     పఱసగు నమ్మంచుకొండ ♦ ప్రస్థముమీఁదన్
     దొరలితొరలి మందాకిని
     పరిపాటిన్ వచ్చివచ్చి ♦ బయలంబడఁగా. 38

కం. ముంగలఁ గైలాసశిఖరి
      ముంగిట గండోపలములు ♦ మునికొనియుండన్
      లింగాకృతితో నయ్యవి
      గంగాశ్రోతోనిపాత ♦ కషితము లయ్యెన్. 39

శా. లింగాకారము తోడనున్న శిలలన్ ♦ లీలావిలాసార్థమై
     నింగిన్‌వచ్చెడి వేల్పుకన్నెలు సదా ♦ నిఃఖేదులై నట్టి ని
     స్సంగుల్ దివ్యతపోధనుల్ గొలుతుర ♦ శ్రాంతంబుసద్భక్తితో
     గంగాభంగ జలాభిషేకమనుచున్ ♦ గౌతూహలప్రక్రియన్. 40

కం. తత్కారణమున నేత
     త్కుత్కీలము మీఁదశివుఁడు ♦కూర్చుండి మహా
     పత్కాలమున నిజ భ
     క్తోత్కరమును బ్రోచునందు ♦రుడుగక పెద్దల్. 41

కం. మతిమాలిన కవిచంద్రులు
     గతిమాలిన వారలగుచుఁ ♦ గదుకకయెవరో
     బతిమాలిన నల్లిరి సి
     బ్బితిమాలిన కత యిదియితి ♦ వృత్తముగాఁగన్. 42

కం. ఈచిత్రకథం జెప్పెదఁ
     బ్రాచీన కవీంద్రకోటి ♦ పల్కినరీతిన్
     “దూచా” లు తప్పకుండఁగ
     నీచిత్తాబ్జమునఁజేర్చి ♦ నిజముం గనుమా. 43

9