8
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
వివిధ రంగాలలో తెలంగాణ వైశిష్ట్యాన్ని విశదీకరించే “తెలంగాణలో తెలుగు సాహిత్య వికాసం”పై సదస్సు వంటి కార్యక్రమాలను పరిషత్తు ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారమై 2014 జూన్ 2వ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణను సర్వతోముఖంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం, సంస్థలు, ప్రజలు ఉద్యమస్ఫూర్తితో కృషి చేయడం హర్షణీయం. తెలంగాణ భాషా సామిత్య కళాసంస్కృతుల వికాసాభ్యుదయాల కోసం ఏడు దశాబ్దాలకు పైగా అంకితభావంతో ముందుకు సాగుతున్న ఆంధ్ర సారస్వత పరిషత్తు బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు పాత్రలో భాగంగా విశిష్ట కార్యక్రమాలకు రూపకల్పన చేసి నిర్వహిస్తున్నది. వాటిలో కొన్ని - తెలంగాణ మాండలిక పదాలు - ప్రయోగ వైశిష్ట్యం, తెలంగాణ ప్రాచీన తెలుగు కవుల కవితా ప్రాభవం, తెలంగాణ చిత్రకళ, శిల్పకళల వైభవం, తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలపై సదస్సు, తెలంగాణ కవయిత్రుల, కథయిత్రుల రాష్ట్రస్థాయి సమ్మేళనం.
తెలంగాణ వైభవోన్నతిపై పరిషత్తు గ్రంథప్రచురణను చేపట్టింది. ఈ పరంపరలో ప్రస్తుత గ్రంథం 'సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు’ దీనికర్త - నిజాం ఏలుబడికింద తెలుగు తీవ్ర ఉపేక్షకు గురైన దశలో ఆ భాషను పరివ్యాప్తం చేసి, సముద్దీపంగావించిన అగ్రేసర వైతాళికుడు - శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారు. భాష, సాహిత్యం, పరిశోధన, విమర్శ, చరిత్ర, విద్య, సంఘసేవ, స్వాతంత్ర్య సమరం, పత్రికారంగం, గ్రంథాలయోద్యమం, సంస్థానిర్వహణ మొదలైన అనేక రంగాలలో విశేష కృషి చేసిన మేధాసంపన్నుడాయన. ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్థాపనలో ఆయన కీలక భూమిక వహించడం గమనార్హం. సురవరం వారు వివిధ ప్రక్రియల్లో 30కి పైగా అమూల్య గ్రంథాలను వెలయించిన సారస్వతమూర్తి. ఒక సందర్భంలో ఆ మహనీయునికి నేనర్చించిన పద్యనివాళి.
అతడు ప్రతాపరెడ్డి; యిరులై పడియున్న తెలఁగువారి గుం
డె తెరల దుల్పివెల్గులను నిల్పిన మిత్రుడు? మూర్ఛవోయిన
ట్టి తెలుగుజాతి నంస్కృతికి టీకలు దీసిన మల్లినాథుడె
న్ని తరములైన ప్రాతపడనేరని సృష్టికి నాద్యుడాతడే.