Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు

అని శ్రావ్యముగా భూపాళ రాగయుక్తముగా పాడుచుండెడివారు. ఈ మేలు కొలుపుల ధాటిలోనే డాక్టరు చిలుకూరి నారాయణరావుగారు “ఉమర్‌ ఖయ్యాము”ను రచించినారు.

శృంగారము

నగరవాసులకు కృతకశృంగారము మెండు. పల్లెటూరి వారిది నిజమైన శృంగారము. పూర్వము వ్రాసిన శృంగార గేయములలో ముఖ్యమైనవి “క్షేత్రయ్య పదములు”. ఇవి క్షేత్రయ్య కవిచే తంజావూరి రఘునాథరాయల కాలములో రచింపబడిన పాటలు. ఇప్పుడు కొన్ని పాటలు ముద్రితములు. “సారంగపాణి పదములు” అనునవి కూడ చాలా వ్యాప్తిలో నున్నవి. నావద్ద నున్న ప్రతి 1899 క్రీ.శ. బరూరు త్యాగరాయ శాస్త్రులవారి కంపెనీలో ముద్రితమైనట్టిది. ఈ పదములను నాలుగు భాగములుగా విభజించినారు. అందొక భాగములో గ్రామ్యభాషలో పాటలు కలవు. తెలంగాణాలో చాలా ప్రాంతములలో “చంద్రమ్మ-వెంకయ్య” పాటలు ప్రచారములో నున్నవి. కాని అవి పామరులలోబడి మార్పులు చెంది బూతులతో నిండిపోయినవి.

యక్షగానాలు - తోలుబొమ్మలు

ఈ వాఙ్మయమును గురించి తందాన కథవలె ప్రత్యేకముగా చెప్పవలసి యుండును. యక్షగానాలు పూర్వములో గొప్ప గొప్ప కవులచేత వ్రాయబడెను. అప్పకవి, కంకంటి పాపరాజువంటి గొప్ప కవులు యక్షగానాలు వ్రాసిరి. అయినను మనము చూచునట్టి యక్షగానాలలోను, విశేషించి తోలుబొమ్మల పాటలలోను, ప్రదర్శనముల లోను తుచ్చ శృంగారము, బూతులు కనబడుచున్నవి.

తత్వాలు:

పాటలలో తత్వాలు విశేషముగా ఇమిడియున్నవి. తెనుగువారిలో చాలా తత్వాలు రచించి అనేక శిష్యులను ఆకర్షించిన గురువులు చాలామంది కలరు. అందు పేర్కొనదగిన వారెవరనగా:-

1. పోతులూరి వీరబ్రహ్మం -వీరు కర్నూలు ప్రాంతము వారుగా కనిపింతురు. వీరు గొప్ప సంఘ సంస్కారులు.