Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గేయ వాఙ్మయం

81


ఈ రెండింటిలో మన చర్చకు సంబంధించినది 'జాతులు', ఈ జాతులు రెండు విధాలట.

జాతి-ఉపజాతి అని. అందు జాతిలో షడ్విధ కందములు, ఉత్సాహి, తరువోజ, అక్కరలు, మంజరి, ద్విపద, త్రిపద, చతుష్పద, పంచపది, షట్పద, నవవిధ రగడలు, కళికలు చేరినవి. ఉపజాతిలో నవ విధ గీతములు, సప్తవిధసీసములు చేరినవి.

అప్పకవి తన ఛందోభాగములో లాలి, పెండ్లి పాట, శ్రీ ధవళము, సువ్వాలె, సువ్వి, యక్షగానము, అను పాటలకు ఛందస్సు నిచ్చి యున్నాడు.

గేయ వాఙ్మయ నిరసనము:

పూర్వము సంస్కృతములో నారితేరిన పండితులు అచ్చ తెనుగు గూడిన పల్లె పాటలను నిరసించినారు. ఈ పల్లెపాటలు విశేషముగా ద్విపదలోను, రగడలోను నుండెడివి. ఈ పాటలను “పదములు” అనియు వ్యవహరించుచుండిరి. శ్రీనాథుడు యొక చాటువున.


“ముది విటులు విధవ లంజలు
పదకవితలు మారు బాస బాపన వారల్‌”


అని పాటలను వ్రాయు కవులను పడ దిట్టె నందురు. మరియు వేణుగోపాల శతక కారుడు


“ద్విపద కావ్యంబు ముదిలంజ దిడ్డి కంతి”


అని చెడ దిట్టెను.

అయినను శ్రీకృష్ణదేవరాయల కాలములో సహితము కొందరు గొప్ప పండితులు ద్విపదలను, పదములను వ్రాసి సంస్కృత పండితుల చేత సహితము మెప్పొందిరి.


“చిన్నన్న ద్విపద కెరగును
బన్నుగ పెద తిరుమలయ్య పదమున కెరగున్‌
మిన్నంది మొరసె నరసిం
గన్న కవిత్వంబు పద్య గద్య శ్రేణిన్‌”


అని తెనాలి రామలింగడు చెప్పెను.