బాల వాఙ్మయం
79
పాశ్చాత్య దేశాలలో ధనికులు తమ ద్రవ్యమును విద్యాభివృద్ధికై వినియోగింతురు. అమెరికాలో ఒక్క హెన్రీ కార్నెజీ అను కోటీశ్వరుడు 5000 గ్రంథాలయములకు భవనములు నిర్మించి వాటి నిండుగా గ్రంథములుంచి అవి చక్కగా నిరంతరాయముగా సాగునేర్పాట్లు చేసెను. అతడొక గ్రంథాలయమునకు మాత్రమే ఇంచుమించు ఏడుకోట్లు రూపాయలిచ్చెను. మన దేశములో ధనికులీవిధముగా సహాయము చేయుట కానరాదు. అందందు కొందరు కొన్ని లక్షలిచ్చినది అతి స్వల్పమగు సేవయే. మూడవది మన జనులలోని భావములు, రుచులు మారవలెను. మంచిదేది చెడ్డదేది గ్రహింపవలెను. ఈనాడు చెత్త పత్రికల కెక్కువ ప్రచారమున్నది. మంచి పత్రికలు బిచ్చమెత్తుకొనుచున్నవి. సినిమా తారల మూడురంగుల బొమ్మలు చూచి తబ్బిబై ఆనంద సాగరములో మునిగి ఉక్కిరిబిక్కిరై ఆ చెత్తను కొనువారే బహుళము. వెర్రిమొర్రి కథలు, దొంగ కథలు వ్రాస్తే వాటికి ప్రచార మెక్కువ.
మన తెలుగులో ఈనాడు బాల, చందమామ వంటి పత్రికలున్నవి. వాటి అనుకరణలు బయలుదేరి అపచారమే చేయుచున్నవి. పై రెండు పత్రికలలో కూడా విజ్ఞానప్రదమైన విషయాలు తక్కువగా కానవస్తున్నవి.
విద్యాశాఖవారు బాల వాఙ్మయము సిద్ధము చేయించి సచిత్రముగా ప్రచురించు టకు కొంత ధనము ప్రత్యేకించి దారిచూపవలెను. మన కేంద్ర ప్రభుత్వ మీ విషయమున శ్రద్ధ కనబరచుచున్నది. కాని ద్రవ్యము మాత్రము ప్రత్యేకించినట్లుగా కానరాదు. హైదరాబాదు ప్రభుత్వము కూడా కేంద్ర ప్రభుత్వాదేశముపై బాల వాఙ్మయ సమితి నేర్చాటు చేసినది. కాని యింతవరకూ వాఙ్మయమునకై ఏమియు ద్రవ్యమును ప్రత్యేకించలేదు.
ఈ అనాదృత వాఙ్మయముపై విద్యావంతుల దృష్టి కేంద్రీకృతము కావలెను.