Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాల వాఙ్మయం

నేడు అన్ని దేశములలో బాల వాఙ్మయమునకు ప్రాధాన్యమియ్యబడుతున్నది. 'బాల వాఙ్మయమే దేశాభివృద్ధికి పునాది' అని గ్రహించినారు. కొన్ని దేశములీ విషయమున చాలా వెనుకబడి యున్నవి. అట్టి దేశాలలో మన ఇండియా చేరినదనవలెను.

ప్రాచీన కాలములో హిందువులు, బౌద్ధులు బాల వాఙ్మయముపై కృషి బాగా చేసినట్లు కానవస్తున్నది. పిల్లలకు ముఖ్యమైనవి కథలు, బొమ్మలు. బొమ్మలతో కథలు చూపించి నిరూపించుట అత్యంత శ్రేష్టమగు పద్ధతి. మన ప్రాచీన శిల్పములన్నియు ఈ విధానమునకు తోడ్పడుచుండిన ప్రతి దేవతా స్థానములో స్తంభములమీద గోడలమీద, కప్పుపైనా, గోపురములలోన పౌరాణిక కథలు బొమ్మలుగా చెక్కబడు చుండెను. కొన్ని తావులలో రంగులతో చిత్రింపబడుచుండిన చదువురాని వారు సహితము ఆ బొమ్మలను చూచి ఇవి బౌద్ధుల కథలు, ఇవి కృష్ణలీలలు, ఇవి పాండవుల కథలు, ఇవి రామాయణ ఘట్టములు అని ఒకరికొకరు చూపుకొని, చెప్పుకొని చెప్పుకొని ఆనందించెడివారు. బౌద్ధ మత వ్యాప్తి కాలములో బౌద్ధ జాతక కథలను శిల్పములలో నిరూపించిరి. అజంతా, ఎల్లోరా, అమరావతి, మధురా, తంజావూరు, లేపాక్షి శు చీంద్రము వంటి నూర్లకొలది దేవస్థానములలో పౌరాణిక గాథలను శిలలపై చెక్కిరి; గచ్చుతో చేసిరి, చిత్రించిరి.

ఆంధ్ర కర్ణాటక దేశాలలో “తోలు బొమ్మలాటలు” అనునవి ఇంచుమించు 1000 ఏండ్ల నుండి ప్రచారములో నుండినట్లు మన కాధారాలు కానవస్తున్నవి. అంతకన్న పూర్వమెప్పుడు ప్రారంభమయ్యెనో తెలియదు. తోలు బొమ్మల మూలాన కూడ పురాణ కథలను చక్కగా గ్రహించుచుండిరి.