Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలుగు వాఙ్మయంలో హాస్యరసము

75

ఆధునిక వాఙ్మయములో వచనములోను నాటకాలలోను హాస్యరసమును ప్రధానముగా పోషించినవారు పలువురు కలరు. వీరేశలింగంగారి ప్రహసనాలు సాధారణమైనవే. చిలకమర్తివారు తమవి ప్రహసనాలని చెప్పినందున తెలియవచ్చినవి. పానుగంటి వారి సాక్షి ఒక భాగము చదివితే వారి రచనలన్నీ చదివినట్లే. బారిష్టర్‌ పార్వతీశం ఉత్తమోత్తమ హాస్యరస గ్రంథరాజము. కాని అది నేటికి అసంపూర్తిగానే ఉన్నది. మునిమాణిక్యాంగొరక్కరే గృహజీవనమును లలిత హాస్యముతో వర్ణించినారు. వేంకటరాయశాస్త్రిగారి ప్రతాపరుద్రీయము అద్భుత హాస్య రస ప్రపూరితము. ధర్మవరం కృష్ణమాచార్యులందందు హాస్య రంగములను రచించిరి. ఇటీవల మల్లాది అవధానిగారు హాస్యరచనల రచించిరి. కాని తల్లితో వసంత మాడినట్లు వారు గుడిపాటివారి వలె పురాణ పురుషులను అవహేళనము చేయజూచిరి. భమిడిపాటి కామేశ్వరరావుగారి రచనలలో హాస్యమున్నది. వ్యావహారిక భాషా మకుటమగు కన్యాశుల్కాన్ని ఎవరున్నూ మరువకూడదు - కాని ఇంగ్లీషు డొక్కశుద్ధి కలవారే దాన్ని ఆనందించగలుగుతారు. గిరీశాన్ని, పేరిగానిని, యెంకిని, కాంతమ్మను, జంఘాలశాస్త్రిని, పార్వతీశాన్ని కిన్నెరసానిని సృష్టించి ఆంధ్రులను ఆనందసాగర తరంగములపై ఓలలాడించిన కవి కుమారులు అపారమగు భాషాసేవ చేసినట్టి సిద్ధహస్తులు; అయినను ఆధునికాంధ్ర వాఙ్మయములో హాస్యరసము ఇంకా ప్రారంభ దశలోనే యున్నదని చెప్పవలెను.