ఖుతుబుషాహీల ఆంధ్ర భాషా పోషణము
69
అబుల్ హసన్ తానీషాకు మంత్రి అక్కన్న. అతడే ఈ దక్కన్ రాజ్యములోని తుది ఆంధ్ర మంత్రి. నాటి నేటివరకు మరల ఆంధ్రులు తలయెత్తలేదు. అక్కన్న మాదన్నలు తెనాలి రామలింగడు అను కమసాలి వ్రాసిన ధీరజనమనో విరాజితము అను తెనుగు కృతికి కృతిపతులైరి. ఆ గ్రంథ మందలి మొదటి రెండు పద్యాలిట్లున్నవి.
శ్రీరమ్యార్థి కళావతంస పద రాజీవార్చనాసక్తు లు
ర్వీరామాధిప కార్య సంఘటన ప్రావీణ్యాధికారుల్ మహా
పారావార గభీరు లాశ్రిత జన వ్రాతావనుల్ సంతతో
దారుల్ యక్కన మాదనాహ్వయులు తత్త్వజ్ఞాన సంపూర్ణులై.
అందనుజన్ముడు మాదన
చందన మందార కీర్తి సంశోభితుడై పొందున నగ్రజుతో నిం
పొందగ తగురీతి పల్కె నురువాక్యములన్
ఈ విధముగా మనకు కుతుబుషా కాలములో సుల్తానుల ఆదరములో వెలసిన
ఆంధ్ర కృతులను గురించి కొంతవరకు తెలియవచ్చినది. ఇబ్రహీం కాలము నుండి
తానీషా కాలమువరకును గోలకొండ నేలిన సుల్తానులు తెలుగువారిని ఆదరించిరి.
తెనుగుభాషను పోషించి, తెనుగు స్త్రీలను పెండ్లాడిరి. తెనుగు స్త్రీలలో ఉంపుడు
గత్తెల నుంచుకొనిరి. వారిలో భాగ్యమతి, ప్రేమావతి, తారామతి అనువారు ప్రసిద్ధులు.
భాగీరథి అను స్త్రీ ఒక సుల్తాను పట్టపు భార్యయై యుండెను.
కుతుబ్షాకాలమునకు ముందు దేశభాషలపై ముసల్మాను ప్రభువుల కాదరణ
లేకుండెను. వారి తరువాత ఏర్పడిన ఆసఫ్‌జాహి వంశము వారును “ముల్కీ” భాషలకు
ఏ మాత్రమును ప్రోత్సాహమును కలిగించినవారు కారు. తెనుగు మంత్రులు, తెనుగు
సుబేదారులు, తెనుగు సేనానులు కూడా కుతుబ్షాల అనంతరము ఎక్కడా కూడా
లేకపోయిరి. ఇప్పుడు నిజాము రాష్ట్రములోని విద్యావిధానములో తెనుగు దిక్కులేనిదై
క్షయమందుచున్నది. ఇది పూర్వాపర సంబంధములతో పరికించిస కుతుబుషాలకు
ఈ విషయములో ధన్యవాదములు సమర్చించుకొనుట కృతజ్ఞతా విధియై యున్నది.