Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

68

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు

అతని గురించి మనమేమియు నెరుగజాలకున్నాము. మల్లారెడ్డి పుణ్యాన అతని పేరైన మనకు తెలిసినది. ఇదే మహమ్మద్‌ ఖుతుబుషా కాలములో గోలకొండ దుర్గములోనే సారంగుతమ్మయ అను గొప్ప కవియుండెను. అతడు సుల్తాన్‌ ఆశ్రయము కలిగినవాడేయని తానే తన వైజయంతీ విలాసములో ఇట్లు వ్రాసుకొనెను.


“ఇనసమతేజు తా నృపులనెల్ల మహమ్మదు షాహి యేలు నీ
యెనుబది నాల్గు దుర్గముల నేలిన యేలిక గోలకొండ, త
ద్ఘన నగరస్థలిన్‌ కరణికం బొనరించెడు తమ్మమంత్రి, యా
జనపతి రమ్ము పొమ్మన ప్రజల్‌ జయవెట్ట గృహస్థు తాననన్‌”


గోలకొండ నగరానికి సారంగుతమ్మయ్య కరణము కావున పాదుషాకీతనితో పనిబడుచుండెను. అట్లున్నను తమ్మయ్య తన దైవభక్తిచే తన కావ్యాన్ని శ్రీరామార్పణము చేసెను.


కందుకూరి రుద్రకవి వంశములో చాలామంది రుద్రకవి నామములుండిరని అందొక రుద్రకవి మల్కిభరాము (ఖుతుబుషా)చే 1480 శా.శ.లో రెంటచింతల పాలెము అను నగ్రహారమును పొందెదనియు వంగూరు సుబ్బారావుగారు శతక కవుల చరిత్రలో వ్రాసినారు. శ్రీ వంగూరి సుబ్బారావుగారు అదే చరిత్రలో మరొక చోట నిట్లు వ్రాసినారు -


ఏనుగు పెద లక్ష్మణకవి తన తుల్యామాహత్మ్యములో తన కృతిపతియగు వత్సవాయి తిమ్మరాజు పుత్రుడగు రాయ జగపతిరాజును గూర్చి యిట్లు వ్రాసెను.


“సుల్తానబ్దుల్‌ హసన్‌ కోటీశ్వరుని చేత మాటిమాటికి బహుమానమందె మరియు పింగలి మాదన్న భానుజీ మంత్రజ్ఞువలన సన్మానమందె అక్కన్న మొదలైన యట్టి పెద్దలచేత మేలు భూషణములు మెప్పులందె”


అక్కన్న మాదన్నలు సేవించినది అబ్దుల్‌ హసన్‌ పాదుషాను కాదు. వారు సేవించినది అబుల్‌ హసన్‌ తానీషాను. దీనిని బట్టి కుతుబుషాల సామంతులును తెనుగును బాగుగా పోషించిసట్లు నిదర్శనములు కనబడుచున్నవి.


కంచెర్ల గోపన్న అక్కన్న మాదన్నల మేనల్లుడని ప్రతీతి. భద్రాచల ప్రాంతమందలి నేలకొండపల్లి గ్రామనివాసి. అతడే ప్రసిద్ధ రామదాసు. అతడు గొప్ప కవి. రామభక్తుడు. భద్రాచల తహసీల్దారుగా నియుక్తుడై వసూలైన పన్నును దేవాలయానికి వినియోగించి బందీకృతుడయ్యెను.