ఖుతుబుషాహీల ఆంధ్ర భాషా పోషణము
65
“మల్కిభరాముడు” ఆంధ్రమును బాగా ఎరిగి యుండెను. సలక్షణముగా మాట్లాడుచుండెను. కవుల శ్రావ్యమగు కవితా ధారా సుధారసమును కుత్తుక బంటిగా గ్రోలెను. తన్మయుడై తల ఆడించెను. ఆవేశపరుడై అడ్డా దిడ్డగా తెనుగు కవనమును స్వయముగా అల్లెను. రమ్ము పొమ్మని కవులతో సరసమాడెను. అద్దంకి గంగాధర కవిని పిలిపించి తపతీ సంవరణోపాఖ్యానమును వ్రాయించి కృతినందెను. అల్లాకాని రసులల్లా కాని ఇబ్రహీం సుల్తానును రక్షించి పోషించుగాక అని అద్దంకి దీవించలేదు. “శౌరి ఘనుడై కరుణారసవృష్టిచే నిరాయాసత బ్రోచుగావుత నృపాగ్ర... మాల్కిభరాము శాందిపున్” అని దీవించెను. ఇబ్రహీము అందులకు సంతసించి గంగాధరునితో నిట్లనెను.
“పెక్కు కృతుల్ చమత్కృతులు బెంపుగ నందితిగాని స
మ్యక్కృతి కన్యపైగల మమత్వము... వర్తింపదు”
ఇట్లని తపతీ సంవరణోపాఖ్యానమను పౌరాణిక గాథను కృతి పొందెను.
సుల్తాను ఆంధ్రభాషను పోషించినది చూచి అతని సేనలో గొప్పయధికారియై యుండిన
అమీన్ ఖాన్ గూడ ఒక కృతిని అందెను.
పొన్నగంటి తెలగనార్యుడు యయాతి చరిత్రము అను అచ్చతెనుగు కావ్యమును
రచించి అమీన్‌ఖానున కంకితమిచ్చెను. తెనుగు వాఙ్మయములో ఇదే మొదటి అచ్చ
తెనుగుకృతి. అమీన్‌ఖాను కూడ మంచి సరసుడు. ఎన్నియో తరాల నుండి గోలకొండకు
20 మైళ్ళ దూరములోనున్న పొట్ల చెరువులో అతని పూర్వీకులు నివసించియుండిరి.
అతని కుటుంబము హిందువులను ప్రేమించి ఆదరించుచుండెను. అతడు చిన్న
దర్బారు చేసి “దీవులేలు బలియులు రౌతుల్ మొదల్గా దను గొలువన్ సంతసమంది
కబ్బములు పేర్కావించు” ఆనందించుచుండెడివాడు. అతనికి ముఖ్య సచివుడు
మరింగంటి అప్పన్న అను ఆంధ్రుడు. అమీన్‌ఖాను ఏమాత్రమున్నూ మతద్వేష
మేకోశములోను లేనివాడు. పైగా హిందువులను తనవారివలె ప్రేమించువాడు.
“కడక నమీనుఖానుడు జగంబు తనుం బొగడంగ వేడ్కతో
విడువక యెప్పుడుం బుడమి వేల్పుల బిడ్డల పెండ్లిచేయు”.
అమీనుఖానునికి ముగ్గురు భార్యలు. అందరును ఉత్తమ పతివ్రతలు.
పొట్లచెరువులోని జనులందరికిని చల్లని తల్లులు. అందు బడేబీబీ అను పెద్ద భార్య
సాక్షాత్తు అన్నపూర్ణాదేవియే!