ఖుతుబుషాహీల ఆంధ్ర భాషా పోషణము
గోలకొండ రాజ్యము నేలిన ఖుతుబుషాహీ ప్రభువులు గాఢమైన స్వమతాభిమానులే కాని బహమనీ సుల్తానులవలె పరమత ధ్వంసకులు కారు. రాజ్యకాంక్ష బాగా కలిగినవారే కాని బహమనీలవలె రక్తపిపాసులు కారు. స్వభాషను మాత్రమే వీరు బహమనీలవలె ప్రేమించినవారు. దక్షిణ దేశమందు శిశుప్రాయమై యున్న ఉర్దూకు వీరు అవలంబన మిచ్చి పోషించిరి. ఈ ఖుతుబుషాహీలు స్వయముగా ఉర్దూ కవనమల్లిరి. పైగా తాము విశేషముగా తెలుగు దేశమును పాలించిన వారగుటచేత తెలుగును కూడా పోషించిరి. తమ సనదులను పార్శీలో వ్రాయించి యిచ్చుచు ఆ విషయములనే తెలుగులో వ్రాయించి ఇచ్చిరి. తెనుగు మండలములలో తెనుగు ద్వారానే రాజ్య వ్యవహారములను సాగించిరి.
మొదటి ఖుతుబుషా చిన్న కుమారుడును మూడవ గోల్కొండ సుల్తాను అగు ఇబ్రహీం ఖుతుబుషా ఏడేండ్లపాటు విజయనగరమందుండి తెనుగు బాగా నేర్చుకొనెను. తాను గోలకొండ సుల్తాను అయిన తరువాత విజయనగరమును నాశనము చేయుటకు ముఖ్య కారకుడయ్యెను. విజయనగర చక్రవర్తియగు అళియ రామరాజుకు దత్తపుత్రుడుగా స్వయంగా ఏర్పడిన అహమద్‌నగర్ సుల్తాను అగు అలీ ఆదిల్షాయును రామరాజుచే ఏడేండ్లు స్వపుత్రునివలె రక్షింపబడిన గోలకొండ ఇబ్రహీమును రామరాజును తళ్ళికోట యుద్ధములో చంపి విజయనగరమును భస్మము చేసి తుంగభద్రలో కడిగి వేసిరి. ప్రపంచంలో కని వినీ ఎరుగని ఉపకారమంటే ఇదొక్కటే యుండవచ్చును. ఈ విధంగా ఇబ్రహీము ఆంధ్రులకు క్షమింపరాని అపకారము చేసినను అతని కొద్దిపాటి తిరిపపు ఆదరణమును మాత్రము ఆంధ్రులు మరువ లేకపోయిరి. ఇదింకొక విచిత్రమగు కృతజ్ఞత. ఇబ్రహీం పేరునే మార్చి ఇభరామును చేసిరి. అతడు ఆంధ్రుల కందరికీ అభిరాముడయ్యెను.