ఈ పుట ఆమోదించబడ్డది
ఆంధ్ర వాఙ్మయ చరిత్ర
63
కొత్త వర్ణనలు, నూత్న విధ విమర్శలు, వ్యాసములు, ఏకాంకికలు, హాస్య రచనలు, పరిశోధనలు, శాసనములు, భాషా శాస్త్రము, వివిధ పత్రికలు, పర భాషా సారస్వతముల భాషాంతరీకరణములు. కుప్ప తెప్పలుగా మనలో బయలుదేరెను. ఇతర దేశ భాషల పరిచయమేగాక, ప్రపంచములో అన్ని భాషల పరిచయము మనకు కలిగెను. ఈ కారణాల చేత మనవారి వేయేండ్ల కృషి ఒక యెత్తు. 1859 నుండి నేటివరకు జరిగిన ఈ నూరేండ్ల కృషి ఒక యెత్తు అనిన అతియోక్తి కానేరదు.
ఆధునిక యుగములో కలిగిన మార్పులు సూక్ష్మముగా తెలుపనైనది. ఆ మార్పులకు కారకులైన కవి పండితుల పట్టికలను ఇచ్చుటకు సాధ్యముకాని పని. అందువల్ల క్రీ.శ. 1900 నుండి ఇంతవరకు భాషా సేవ చేసినవారి పేరులు సూచించుటకు వీలు లేదు.
ఆంధ్ర వాఙ్మయ చరిత్ర అతి సంగ్రహముగా ఇందు సూచితమైనది. ఇందు ఉత్తమ కృతులని సూచించిన వన్నియు సారస్వత ప్రియులు చదువవలెను.