62
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
మరొక ఇంగ్లీషువాడు 1788 నుండి 1820 ప్రాంతము వఱకు మద్రాసులో ఇంజనీయరుగా నుండెను. అతడు తెనుగుదేశములోని చారిత్రక గాథలను అన్నింటిని వ్రాయించి “కైఫియత్తులు” సమకూర్చి అదే లిఖిత పుస్తకాగారములో నుంచెను. నేటికిని అవి అమూల్యమైనవి. కాని వాటిని ముద్రించు ఆలోచన ఎవ్వరున్నూ చేయనందున అవి శిథిలమై పోతున్నవి. యూరోపు నుండి మన దేశమునకు వచ్చిన మిషనరీలకు మనము చాలా బుణపడియున్నాము. వారు మన దక్షిణ భాషలలోని ఆటవిక భాషలకు గూడ వ్యాకరణాలు వ్రాసి ఆ భాషలలో క్రైస్తవమత పుస్తకాలను రచించి అచ్చువేసిరి. క్రీ.శ. 1856లో కాల్డ్వెల్ అను ఇంగ్లీషు పండితుడు తెనుగు, తమిళము, కన్నడము, మళయాళము మున్నగు దాక్షిణాత్య ద్రావిడ భాషల కన్నింటికిని ఒక భాషా శాస్త్రమును రచించి ముద్రించెను. “కురుఖు” అను లిపిలేని ఆటవిక భాషకు డాక్టర్ హోర్ అనువాడు వ్యాకరణము వ్రాసెను. “మల్తో” అను మరొక భాషకు డ్రొజే అనువాడు వ్యాకరణము వ్రాసెను. గొండి భాషకు విలియం సన్ వ్యాకరణము వ్రాసెను. “కోదు” భాషకు బుషే మొదలగు ముగ్గురు పాశ్చాత్యులు వ్యాకరణములు వ్రాసి బైబిలును ఆ భాషలో ముద్రించిరి. గ్రియర్సన్ అను ఇంగ్లీషువాడు భారతీయ భాషలన్నింటిని గురించి పుస్తకాల సంపుటముల ననేకముగా రచించి ముద్రించెను. (Linguistic sur- Vey) మన తెనుగునకు గూడ క్రీ.శ. 1850 ప్రాంతములో ఫ్రెంచి మిషనరీలు నిఘంటువును, వ్యాకరణమును వ్రాసిరి. క్రీ.శ. 1807లో తెనుగు వ్యాకరణమొకటి అచ్చయ్యెను. ఈ విధంగా ఇంగ్లీషు, ఫ్రెంచి, పోర్చుగీసువారు మన ద్రావిడ భాషలకు చేసిన సేవలో దశాంశమైనను నేటికిని మనము చేయలేదు.
ఇంగ్లీషువారు మన దేశమును జయించి మనల బానిసలనుగా చేసి రాజకీయముగా, ఆర్థికముగా పతితులనుగా జేసిరి. కాని మన సారస్వతానికి వారు అపారముగా ఉపకారము చేసినవారైరి.
ఒక వేయి యేండ్ల నుండి మనము వ్రాసిన పురాణాలనే వ్రాస్తూ, వర్ణించిన శృంగారాన్నే మళ్ళీ మళ్ళీ వర్ణిస్తూ, వ్రాసిన పద్యాలనే వ్రాస్తూ ఉండిన వారము. మనలో గొప్ప మార్పును ఇంగ్లీషు వాఙ్మయము కలిగించెను. ఇంగ్లీషు విద్య దేశమందు వ్యాపించిన కొలది మనలో మార్పులు కలిగెను. తత్ఫలితముగా వచనములు, నవలలు, నాటకాలు, సైన్సులు, చరిత్రలు, భూగోళము, చిన్న కథలు, ఖండకావ్యాలు, గేయములు,