Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు

వరకుండు కాలమును సంధి యుగమని పేర్కొననైనది. ఈ కాలములో ఉత్తమ రచనలు కానవచ్చుట లేదు. అట్లున్నను సారస్వత చరిత్రలో ఆ కవులను గూడ సూచించుట అవసరము. ఈ కాలములో ముఖ్యులైన కవులను వారి రచనలను సూచింతుము.

శంకర కవి - హరిశ్చంద్రోపాఖ్యానము
చిత్రకవి సింగరార్యుడు - బిల్హణీయము
కిరీటి వెంకటాచార్యులు - ఆచలాత్మజా పరిణయము
కుమ్మరి మొల్ల - రామాయణము
ముద్దు పళని - రాధికా సాంత్వనము
ఆడిదము సూరకవి - రామలింగేశ శతకము
కూచిమంచి తిమ్మకవి - రసికజన మనోభిరామము మున్నగు బహు గ్రంథములు
కూచిమంచి జగ్గకవి - చంద్రరేఖా విలాపము, సుభద్రా పరిణయము
శిష్టు కృష్ణమూర్తి - అనర్ఘ రాఘవము
కాణాదము పెద్ధన - ఆధ్యాత్మ రామాయణము, ముకుంద విలాసము
తరిగొండ వెంకమ్మ - వెకటాచల మహాత్యము

ఈ సంధి యుగములో ఇద్దరిని గురించి ప్రత్యేకముగా సూచింపవలెను. ఒకరు వేమన. ఇంకొకరు త్యాగరాజు. వేమన క్రీ.శ. 1700-1750 ప్రాంతములోని వాడు. అతడు ఆట వెలదులు వ్రాసినట్లుగా ఏ తెలుగు కవియు నేటివరకు వ్రాయలేదు. అతడు మహాకవి. గొప్ప వేదాంతి, అందులో సకల జనులకు అర్థమగు వేదాంతమును భోదించినాడు. అతడు అపూర్వ సంఘసంస్కర్త. సంస్కర్తలు విమర్శిస్తేనే జనులకు కోపము. వేమన లోపమున్న వారిని తిట్టి అందరిని నవ్వించి మెప్పు పొందినవాడు. అతని పద్యాలు కంఠపాఠము రాని తెనుగు విద్యావంతుడు కానరాడు.

క్రీ.శ. 1759 నుండి 1857 వరకు తంజావూరులోని తిరువాడిలో నివసించిన త్యాగరాజు ఆంధ్రుల చరిత్రలో అద్వితీయుడైన గాయక చక్రవర్తి. అంతేకాదు. మొత్తము