ఆంధ్ర వాఙ్మయ చరిత్ర
57
“ఒడిలోన పంచాంగ ముంచు కొన్నదిగాన
కెటుపోయె ననుచు నూరెల్ల వెదకు
పనిలేనిపని వీధి జనుచు గ్రమ్మరు నాత్మ
గృహమంచు నెంచి యిల్లిల్లు దూరు
అపుడు భుక్తి యొనర్చి యవునసే సంకటి
తింటినాయని యింటి తెఱవ నడుగు
కుఱచ దోవతి కట్టుకొని యెవ్వరోయిట్లు
గట్టిపోయిరటంచు గలవరించు
గడియలో తెల్లవాఱె, భాస్కరుడు గ్రుంకె
జాగులేలంచు సందెపై సందెవార్చు
కంతుమాయల నుమ్మెత్తకాయఁ దిన్న
పొలుపు సారెకు దెల్పునప్పుడమి వేల్పు”.
వర్ణనయైనను సరే సహజాలంకారములతో స్వభావోక్తులతో చక్కని తెనుగుతో
నిండియుండును.
గోలకొండ కవులు
విజయనగర రాజుల కాలములో గోలకొండ కుతుబ్షాల కాలములో అందు ముఖ్యముగా ఇబ్రహీం కుతుబ్షా కాలములో పలువురు తెనుగు కవులుండిరి. అందు ముఖ్యులు మొదటి అచ్చ తెనుగు కావ్యమగు యయాతి చరిత్రమును వ్రాసిన పొన్నగంటి తెలగనార్యుడు, మాలిక్ ఇబ్రాహీం కుతుబ్షా (మల్కిభరాముని) ఆస్థాన కవియైన అద్దంకి గంగాధర కవియునై యుండిరి. ఇతడు తపతీ సంవరణోపాఖ్యానమును రచించెను. గోలకొండ ఖిల్లాలో కరణముగా నుండిన సారంగుతమ్మయ వైజయంతీ విలాసమను మంచి కావ్యమును రచించెను. ప్రౌఢ కవి మల్లారెడ్డియును ఈ కాలమువాడే. అతడు దోమకొండ ప్రభువులకు పూర్వ పురుషుడు. అతడు షట్చక్రవర్తి చరిత్ర మున్నగు పెక్కుగ్రంథాలను రచించెను. నిరంకుశోపాఖ్యానమును వ్రాసిన కందుకూరి రుద్రయ్య ఈ కాలము వాడే. ఓరుగల్లును కొంత కాలము పాలించిన షితాబ్ఖాన్ (సీతాపతి) కాలములో చరిగొండ ధర్మన్న చిత్ర భారతమును రచించెను.