Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు

ఆళియ రామరాజు ఆస్థానకవి యగుటచే రామరాజ భూషణుడు అను ఖ్యాతి గాంచిన భట్టుమూర్తి కవి వసుచరిత్రను వ్రాసెను. అందు శ్లేషలు. యమకములు, ఉత్ప్రేక్షలు విశేషముగా గలవు. అతడు వ్రాసిన పద్ధతిపై ఇతరులు వ్రాయబోయి వెల్లకిలబడిరి. అతనిని పూర్తిగా ప్రతి పద్యములో అనుకరించిన వాడు కొల్లాపుర మాధవరాయలు. అతడు చంద్రికా పరిణయము రచించెను.

రామరాజు కాలములో పింగళి సూరన కళాపూర్ణోదయమును రచించెను. అది అద్భుత కల్పనా కథ. అది తెనుగు సారస్వతములో అపూర్వమగు గ్రంథము. ఇతని ప్రభావతీ ప్రద్యుమ్నము కూడా చక్కని గ్రంథము. ఇతడు మొదటి ద్వ్యర్థి కావ్యమగు రాఘవ పాండవీయము రచించెను.

ఇదే కాలములో తెనాలి రామకృష్ణుడు పాండురంగ మాహాత్మ్యమును రచించెను. అందు మారుమూల పదాలు బహుళము. కొన్ని వర్ణనలు చక్కగా ఆకర్షకములుగా నున్నవి.

విజయనగర సామ్రాజ్య కాలములో ఈ క్రింది వారుకూడా రచనలు చేసిరి. మనుమంచి భట్టు, దుగ్గన, తాళ్ళపాక చిన్నన్న, సంకుసాల నృసింహకవి (కవి కర్ణ రసాయన కర్త) రామభద్రకవి, ఎఱ్ఱన (శృంగార మల్హణ చరిత్రకర్త) రామరాజరంగన్న కుమార దూర్జటి (కృష్ణరాయ విజయము), తిరువెంగళ నాథుడు, మున్నగు పలువురు తమశక్తికొలది పద్యకావ్యములు రచించిరి. కాని ఉత్తమ శ్రేణిలోనివికావు.

విజయనగరపు తుదిరాజగు శ్రీరంగరాయలు చంద్రగిరిలో రాజ్యము చేసిన కాలముననో ఇంచుక తర్వాతి కాలముననో క్రీ.శ. 1600-1650 ప్రాంతములో వుండినవాడు కదిరీపతి. ఇతడు అనంతపుర మండలములోని కదిరి నివాసి. ఇతడు శుకసప్తతి యను కథల పుస్తకమును రచించెను. ఈ శుకసప్తతి తెనుగు సారస్వతములో తృతీయ పంథ త్రొక్కినదనవచ్చును. ఇందు హాస్యము, తెనుగు నుడికారము, లలితమగు శైలి, లోకానుభవము, చక్కని శృంగార రసము అన్నియు నిండి ప్రతి పద్యము మనోహరముగా నుండును. ఇతని వర్ణనలు ఇతర ప్రబంధ కవులవలె అంధాను కరణములు కావు. విరహ తాపం కలిగితే కవులందరు చంద్రుని, గాలిని, చిలుకలను, వసంతుని తిట్టిరి. ఈ కవి కథలోని ఒక (బ్రాహ్మణుడు విరహతాపము పొంది యిట్లవస్థపడినాడు.