ఆంధ్ర వాఙ్మయ చరిత్ర
55
బిరుదైన కవి గండపెండేరమున కీవె
తగుదని తానె పాదమున దొడిగె
గోకట గ్రామాద్యనేకాగ్రహారంబు
లడగిన సీమలయందు నిచ్చె
ఆంధ్ర కవితా పితామహ యల్లసాని
పెద్దన కవీంద్రయని నన్ను బిలుచునట్టి
కృష్ణ రాయలతో దివి కేగలేక
బ్రతికి యున్నాడ జీవచ్చవంబ నగుచు.”
శ్రీకృష్ణ దేవరాయల ఆస్థాన మందలి అష్ట దిగ్గజము లెవరనగా! 1. అల్లసాని
పెద్దన, 2. నంది తిమ్మన (ముక్కు తిమ్మన), 3. అయ్యలరాజు రామభద్ర కవి
4. ధూర్జటి, 5. మల్లన (ఫ్రౌడకవి), 6. పింగళి సూరన, 7. రామరాజ భూషణుడు,
8. తెనాలి రామకృష్ణుడు. తుది ముగ్గురు కృష్ణరాయల కాలములో గ్రంథాలేవి
రచింపలేదు. నంది తిమ్మనకు ముక్కు పెద్దదిగా నుండెనేమో ముక్కు తిమ్మన అనియే
అతడు ప్రసిద్ధి నొందెను.
“ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు”
అని నానుడి యేర్పడెను. అతడు పారిజాతాపహరణము రచించెను. అది ఉత్తమ కావ్యాలలో చేరినట్టిది.
“జలజాతాసన వాసవాది సురపూజా భాజనంబై తన
ర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబునన్
దొలగంద్రెసె లతాంగి యట్లయగు నాథుల్ నేరముల్ సేయ పే
రలుకం జెందిన యట్టి కాంతలుచిత వ్యాపారముల్ నేర్తురే?”
ఇట్టి సుందర పద్యములను నంది తిమ్మన వ్రాసెను.
కృష్ణరాయల కాలములో యెల్లనార్యుడు - నాదెండ్ల గోప ప్రధాని కూడా రచనలు చేసిరి. అవి అంత గొప్పవి కావు.
ధూర్జటి కవి కాళహస్తి మాహాత్మ్యము అను కావ్యమును రచించెను. అది ఉత్తమ ప్రబంధాలలో చేరినట్టిది. మల్లన రాజశేఖర చరిత్రము కూడ అదే శ్రేణిలో చేరినది.