Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్ర వాఙ్మయ చరిత్ర

53


కాక సైరింపవచ్చునే లోకదహన
దర్పితంబైన యస్మత్ర్పతాప వహ్ని
తావకోత్పాహ సాహసౌదార్య ధైర్య
గతికి మెచ్చితి విక్రమార్క క్షితీంద్ర!”

అని సంస్కృత పద జటిలముగా వ్రాసెను.

“పలుకులు వేయు నేటికిక, బ్రాహ్మణసూనుడ వీవు, నీకు దో
ర్బలమున కేమి కారణము, బాపనపోటును, కప్పకాటునుం
గలదె ధరిత్రి? భట్టిమొన గట్టిగ నమ్మకు, మోసపోకు, నీ
కొలదులె రాచకార్యములు, కోమటి బుద్ధుల దీర్పదీరునే?”

అని లలితముగా గూడ రచించెను.


పిల్లలమఱ్ఱి పినవీరన సూర్యాపేట యొద్దనుండు పిల్లలమఱ్ఱివాడు యందురు. అతడు జైమినీ భారతము వ్రాసి సాళువ నరసింహరాయల కంకితమిచ్చెను. అతని శృంగార శాకుంతలము, జైమినీ భారతము ప్రసిద్ధ కావ్యములు. “వాణి నా రాణియని యెద విరుచుకొని పలికినదీ పినవీరనయేనట! ఈ వీరభద్రుడు “విపులచాటూక్తి నిర్ణిద్రుడు”. తుళు వంశపు నరసింహరాయలకు నంది మల్లయ్య, ఘంట సింగయ్య అను జంటకవులు తమ వరాహపురాణము నంకితమిచ్చిరి.

శ్రీకృష్ణదేవరాయల కాలము ఆంధ్ర సారస్వతమునకు మహావైభవకాలము. అతని యాస్థానములో అష్టదిగ్గజములు అను ఎనిమిది మంది కవులుండిరని ప్రతీతి. కాని యందు పేర్కొనబడిన కవులలో కొందరు అతని ఆస్థానమువారు కారు.

శ్రీకృష్ణదేవరాయలు స్వయముగా మహాకవి. అతడు ఆముక్తమాల్యదను వ్రాసెను. దానినతడు వ్రాయలేదనీ, మను చరిత్ర వ్రాసిన అల్లసాని పెద్దన వ్రాసెననీ అందురు. కాని ఈ రెండు పుస్తకముల శైలిని చూచిన రెంటికిని ఏమిన్నీ పోలిక లేదు. ఆముక్తమాల్యద శైలి చాలా బిరుసు. మను చరిత్ర శైలి తీర్చి దిద్ది మృదువుగా, ఇంపుగా నుండునట్లు వ్రాసినది. ఆముక్త మాల్యద సానబట్టని గనిలోని రత్నము - మను చరిత్ర మెఱుగిచ్చి వంకలు దిద్దిన వజ్రము.