ఆంధ్ర వాఙ్మయ చరిత్ర
51
రామరాజు తమ్ముడు తిరుమలరాజు పెనుగొండను రాజధానిగా చేసుకొని విజయనగర సామ్రాజ్యాన్ని పాలించెను. అతని తర్వాత శ్రీరంగరాయలు చంద్రగిరిని రాజధానిగా చేసుకొని ఇంచుమించు 1650 వరకు రాజ్యము చేసెను. అటు తర్వాత విజయనగర సామ్రాజ్యము సంపూర్ణముగా నశించెను.
ఇక 1350 నుండి 1650 వరకు వాఙ్మయ స్థితి ఎట్టిదో కనుగొందము.
ఈ 300 ఏండ్ల కాలమును ప్రబంధ యుగమని చెప్పవచ్చును. ఈ కాలంలో అష్టాదశ వర్ణనలతో సంస్కృతపద భూయిష్టశైలితో శబ్దాలంకార బాహుళ్యముతో గొప్ప గొప్ప ప్రబంధాలు రచింపబడెను.
మొదట బుక్కరాయల కాలంలో నాచసోమనాథుడను మహాకవి యుండెను. అతనికి గుత్తి దుర్గము క్రింద నుండు పెంచికలదిన్నెను అగ్రహారముగా బుక్కరాయలు దానము చేసినందున అతడాగ్రామము వాడనుట స్పష్టము. ఆ దాన శాసనములో కవి నిట్లు వర్ణించినాడు.
“యాజుషాణాం వరేణ్యాయ సకలాగమ వేదినే
అష్టాదశ పురాణానా మభిజ్ఞాతార్థ వేదినే
అష్ట భాషా కవిత్వశ్రీ వాణీ విజిత సంపదే
సోమాయ నాచనాం భోధేః సోమాయామిత తేజసే”
దీనిని బట్టి అతని పాండిత్య కవిత్వ మహత్వము సువ్యక్తమగుచున్నది.
తిక్మనవలె అతడు అసాధారణ కవి. అతడు ఉత్తర హరివంశమును రచించెను. అతడు క్రీ.శ. 1340 ప్రాంతమువాడు. అతడు “సకల భాషా భూషణుడు”, “సాహిత్య రస పోషణ సంవిధాన చక్రవర్తి”. “అలికంబున యక్షిని దాచినట్టి సర్వజ్ఞుడు”, అష్ట భాషా కవిత్వ విశారదుడు”, “నవీన గుణ సనాథుడు”. సీస పద్యము ఇతని చేతిలో పరిణతి నందెను.
కల్హార మకరంద కలిత మందాకినీ
లహరీపరీత కోలాహలంబు
బాలేందు చంద్రికా పరభాగశోభా ప
రాగ సంభావితా రగ్వధంబు
సేవాసమాసన్న సిద్ధ సీమంతినీ
తాలవృంతోత్తాల తాండవంబు