Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్ర వాఙ్మయ చరిత్ర

49

రెడ్డిరాజుల సమకాలికులు రాచకొండ దేవరకొండలకు ప్రభువులైన వెలమరాజులు. అందు సర్వజ్ఞ బిరుదు వహించిన సింగమనాయకుడు సంస్కృతములో రచనలు చేసెను. అతని కాలమందే, అతని సీమ యందే కోలాచల మల్లినాథ సూరి యుండెను. జనగామ తాలూకాలో బమ్మెర అను గ్రామము కలదు. అది పాల్కురికి సోమనాథుని పాలకుర్తికి రెండు మూడు మైళ్ళ దూరముననున్నది. ఆ గ్రామము పోతనామాత్యుని జన్మదేశమై పవిత్రమైనది. పోతనామాత్యుడు ఆంధ్ర మహాభాగవత మును రచించిన మహాకవి. అతని భాగవతము అనేకులు పారాయణము చేయుదురు. అతనికి శిష్యులైన ఏర్చూరి సింగయ్య, వెలిగందల నారయ్య, గంగయ్య అనువారు భాగవతములో కొన్ని భాగములను రచించిరి.

సర్వజ్ఞ సింగభూపాలుడు భాగవతమును తన కంకిత మీయనందున దానిని పాతి పెట్టించగా ఖిలమైన భాగాలను పోతన శిష్యులచే పూరించిరను అపవాదము కల్పితమయ్యెను. అది అబద్ధము. ఆ ముగ్గురు శిష్యులలో ఒకరు కూడ సూచన మాత్రముగానైనను ఆ మాట వ్రాయలేదు. అట్లయితే వారెందుకు కొన్ని భాగాలను వ్రాసిరనగా పోతన తన శిష్యులను అనుగ్రహించుటకై వారిచే కొన్ని భాగాలను వ్రాయించి తనతోపాటే వారిని గూడ వందనీయులనుగాజేయ సంకల్పించి యుండేనేమో. ఆ ముగ్గురు శిష్యుల కవనము కూడా పోతన కవితకు కుడియెడమగా ప్రశంసా పాత్రముగా నున్నది.

పోతన భగవద్భక్తుడు. అతడు భక్తిరసాన్ని అద్వితీయముగా అసామాన్యముగా భాగవతమందు చిప్పిల్లజేసెను. భక్తిరస ఘట్టములందు అతడు కవిత్రయాన్నే కాక ఆంధ్ర కవులందరిని కూడా మించినవాడయ్యెను. ప్రహ్లాద చరిత్ర, కుచేలోపాఖ్యానము, గజేంద్రమోక్షము, ధృవచరిత్ర, అంబరీషోపాఖ్యానము ఉత్తమమైన భక్తిరస ప్రధాన ఘట్టములు. అందు ప్రహ్లోద చరిత్ర అగ్రస్థానమలంకరించును.


“మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు వోవునే మదనములకు”


అను పద్యము వంటి పద్యాలు అందు నిండుగా గలవు. క్రీ.శ. 1420 ప్రాంతంలో రాచకొండ రాజుల యాశ్రములో నుండిన కొరవి గోపరాజు అతని సింహాసన ద్వాత్రింశిక మనోహరమగు విక్రమార్క కథల కావ్యము.