ఆంధ్ర వాఙ్మయ చరిత్ర
41
ఇక్ష్వాకులు, అశ్మక, ములక దేశములు రాజ్యము చేసినట్లు వాయు పురాణము చెప్పుచున్నది. ములక దేశము నిప్పటికిన్ని మొలకసీమ అని పిలుచుచున్నారు. అది యిప్పటి పాలమూరు జిల్లా. అక్కడ నుండి ములకసీమ (మురికినాడు) కర్నూలు, కడప మున్నగు ప్రాంతాల నాక్రమించుకొని యుండెను.
శాలంకాయనులు అను రాజవంశము వారు తెనుగుదేశములో క్రీ.శ. 5వ శతాబ్దమందు రాజ్యము చేసినారు. వారి శాసనాలలో మన కర్థమగు కొన్ని తెనుగు పద్యములున్నవి. ఊరు, చెరువు, మునుడు ఇట్టి పదాలు కొన్ని గలవు. క్రీ.శ. 5వ శతాబ్దమందు అనగా నన్నయభట్టు కంటె 600 ఏండ్లకు ముందు ఆంధ్రదేశమున రాజ్యము చేసిన విష్ణుకుండిన రాజుల దాన శాసనములలో ఒక దానియందు “వర్షంబుల్” అను తెనుగు పదము గలదు. ఇట్టి నిదర్శనములను బట్టి తెనుగు భాషయు, తెనుగు రచనయు (శాసనములోనే అనుడు) క్రీ.శ. 400 నుండి యుండెననుట స్పష్టము.
విష్ణుకుండిన రాజుల వంశములోని వాడగు జయాశ్రయుడు అను బిరుదు గల మాధవవర్మ నన్నయకు అయిదు నూరేండ్లకు ముందుండినవాడు. అతడు జనాశ్రయచ్ఛందమను ఛందఃశాస్త్రమును వ్రాసెను. అందు శీర్ష లక్షణము అనగా సీస పద్య లక్షణములను తెలిపినాడు.
నన్నయకు పూర్వము తరువోజ, సీసము, అక్కరలు విశేషముగా ఉండి యుండును. నన్నయ తరువోజలు, అక్మరలు అను కొన్నిపద్యాలను మహాభారతములో వ్రాసెను. తర్వాతి కవులు వాటిని పరిహరించిరి. నన్నయకంటె ముందు ద్విపదలోను, దాని భేదములగు వృత్తములోను వ్రాసి జనులు పాడుకొను చుండిరి. ఇంచుమించు క్రీశ. 1240 నుండి 1300 వరకుండిన పాల్కురికి సోమనాథుడు తనకన్నా ముందు కాలములో నుండిన చాలా విధములైన పాటలను గూర్చి ఇట్లు తన పండితారాధ్య చరిత్రలో వ్రాసెను.
“మదినుబ్బి సంసార మాయాస్తవంబు
పదములు, తుమ్మెద పదముల్, ప్రభాత
పదములు, శంకర పదముల్, నివాళి
పదములు, వాలేశు పదములు, గొబ్బి