ఆంధ్ర వాఙ్మయ చరిత్ర
ఆంధ్ర భాష, ఆంధ్ర వాఙ్మయము చాలా ప్రాచీనమైనదేకాని మనకు లభించిన
మొదటి గ్రంథము 900 ఏండ్లనాటి ఆంధ్ర మహాభారతమే. ఆంధ్రుల ప్రశంస సంస్కృత
మహాభారతములో, రామాయణములో, ఐతరేయ బ్రాహ్మణములో - ఇట్టి అతి ప్రాచీన
గ్రంథాలలో లభించినది. ఆంధ్రులు క్రీ.పూ. 200 ఏండ్ల ప్రాంతము నుండి మహా
సామ్రాజ్యాలు స్థాపించి ప్రపంచ ఖ్యాతి కాంచిన వారు. అట్టివారి భాషలో క్రీ.పూ.
200 ఏండ్ల నాటి నుండి క్రీ.శ. 1050 వరకు అనగా నన్నయ భట్టు కాలము వరకు
ఇంచుమించు 1200 ఏండ్ల కాలములో వ్రాసిన ఒక గ్రంథము కూడా లభించక
పోవుట చాలా ఆశ్చర్యకరము. నన్నయ భట్టుకు పూర్వము తెనుగు భాష, తెనుగు
కవిత్వము లేదని కాదు. ఆ రెండున్నూ ఉండెను. కాని మనకు గ్రంథమొకటైన
దొరుకలేదనుటయే విచారకరమైనది.
నన్నయ కంటె ఏడు నూరేండ్లకు పూర్వము నుండి అనగా క్రీ.శ. నాల్గవ శతాబ్దము నుండి తెనుగు రచనలు ఉండినట్లు మనకు కొన్ని నిదర్శనాలు కనిపించుచున్నవి. దినేశ చంద్ర సర్కారుగారు “శాతవాహనుల తర్వాతి వారు” అను తమ ఇంగ్లీషు గ్రంథములో ఇట్లు వ్రాసినారు.
“ఇక్ష్వాకు రాజుల ప్రాకృత శాసనాలు కొన్ని జగ్గయ్యపేటలో లభించినవి. నాగార్జున కొండలోని రికార్డుల భాషను గూర్చి అది ఒక విధమైన ప్రాకృతమని బహుశా కన్నడమయి యుండునని స్టెన్ కొనోప్‌గారు అభిప్రాయపడిరి. నాగార్జున కొండలో కొన్ని ప్రాకృత శాసనాలు దొరికినవి" అయితే జగ్గయ్యపేట, నాగార్జున కొండ అను నీ రెండు స్థలాలు తెనుగు నడిగడ్డలో నున్నందున అచ్చటి ప్రాకృత భాష తెనుగు రూపమై యుండియుండును. కాని కన్నడము కానేరదు. కన్నడమైనను క్రీ.శ. నాల్గవ శతాబ్దిలో తెనుగు నుండి అంతగా భిన్నించినట్టిది కాదు.