Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాథా సప్తశతి

39

కాని రసభంగము చేయదలచిన యొక వ్యాఖ్యాత యిట్లన్వయించినాడు. అంతటి యాప్రేమ యాకాంతకు తన ప్రియ భర్తపై నుండగా నామెను విటుడు కోరుట వ్యర్థమని దూతీ సూచనయట! లేదా యామె భర్తతో ఏమయ్యా! నీవు లేనందున కృశించి చావసిద్ధంగానున్న నీ భార్యను గూడ కెందుకాలస్యము చేసెదవు అని యతని భార్య యొక్క దయనీయస్థితిని యతనితల్లి దుఃఖమును ఎందరో మిత్రులు తెలిపిరని వ్యాఖ్యానింపవచ్చును.

ఇంచుమించు ప్రతి పద్యము అమృతఝరియై (అమృతం ప్రాకృత కావ్యం 1-2) కామతత్వ చింతామణియై (కామస్యతత్త్వ చింతాం1-2) స్వభావ రమణీయమై (7-101) రసిక జన హృదయదయితై (1-101) అమృతమును కూడ నిరాకరింప జేయు మాధుర్యము కలదై (మధురత్వే నామృతమ ప్రియచ్ఛృత్వానోలగతిహ్రదయే (4-101) నానాలంకార లలితమై (1-3) ధ్వని ప్రధానమై సంతతాహ్లాద కారియై, గంభీర భావ పరంపరా సంపూరితమై రస సిద్ధుల పూర్ణ చంద్రోదయ ఘటికయై శ్లాఘాపాత్ర మైనట్టి గాథా సప్తశతి భారతీయ సాహిత్య రత్నములలో కొహినూర్‌! గాథలో కూర్చిన హాలుని రాజ్యమెన్నడో పోయెను. కాని యతని కావ్య సామ్రాజ్యమునకు కొట్టుబాటు లేదు. దానికి నిత్యనూత్నత కలదు. సుకవితా యద్యస్తి రాజ్యేనకిం?

ఇట్టిగాథలలో నూరింటి నేరి వ్యాఖ్యానించిన సర్వజ్ఞ చక్రవర్తి పెదకోమటి వేమభూపాలుని వ్యాఖ్య యేది? ఇంచుమించిరువది పండితులు వ్రాసిన వ్యాఖ్యానాలేవీ? ఈ గాథలకు తెలుగు వ్యాఖ్యలను వ్రాసి ఉత్తమ పీఠికను చేర్చి ముద్రించుట అవసరము. ఈ సప్తశతిని రసికులందరును చదివి యానందింతురు గాక.


సంధ్యోపాత్త జలాంజలి బింబిత గౌరీముఖాంబురుహం
స్ఫురితాధరం ముధైవహి విగళిత మంత్రం హరీం నమత. 7-100

సంధ్య వార్పగ దోసిట జలమువట్టి
నపుడు గౌరీముఖాంబుజ మందుదోప
మంత్రమంతయు నొకమారు మరచినట్టి
మోవిని గదుల్చు శివునకు మ్రొక్కులిడుదు.

శివునికి పట్టిన గతియే సప్తశతీ పాఠకులందరికిని పట్టుగాక!
                                                          సుజాత. (15 మే 1951)