శ్రీ రాజాబహద్దురు వేంకటరామారెడ్డిగారు
391
“అవును?”
“తీసుకొనిపోయి”
“వ్యవసాయము చేయింతుము”
“చదివించరా?”
“ఎవరు చదివింతురు? ఖర్చెవ్వరు భరింతురు? అది మావల్ల కానిపని.”
“సరే, మీరీ బాలుని నాకప్పచెప్పుడు”
“వీలులేదు”
“అప్పజెప్పవలసినదే. ఆ బాలుని ముట్టితిరా, ఖబడ్దార్!”
బంధువులు అందుకు మారు చెప్పలేక, “వాని తిప్పలు దైవమెరుగు"నని పఠానున కప్పగించి వెడలిపోయిరి.
బాలుడు బ్రహ్మానంద భరితుడయ్యెను.
మరునాడే పఠాను బాలుని వెంటనిడుకొని హైదరాబాదు నగరమున కరిగి పెద్ద పెద్ద అధికారుల వద్దకు పిలుచుకొనిపోయి “ఇతడు విలియం వహబు (పోలీసు మొహతెమీం) సూపరింటెండెంటు గారి మేనల్లుడు”అని చెప్పి పోలీసు శాఖలో అమీన్ (సబినస్పెక్టరు) పదవినిప్పించెను.
విలియం వహబ్ అను పదమును విన్నంతనే యీ పురుషుడు ఇంగ్లీషు వాడా, ముసల్మానా, లేక ఉభయ సంబంధము కలవాడా అనే పాఠకు లూహలకు పోవుదురు; కాని అతడు రెడ్డియే.
క్రీ. శ. 1865లో దివంగతులైన వనపర్తి సంస్థానాధీశ్వరులు ప్రథమరామేశ్వర రాయల వారు గొప్ప సంఘ సంస్కారపరులలో అత్యుత్తములు (ఈ మహారాజే ఆంధ్రులందరిలోను మొదటి సంస్కారి అని నేనిదివరలో గోల్కొండ పత్రికలో విపులముగా వ్రాసియున్నాను). తత్ఫలితముగా వారు తమ బంధువులలో ఏడుగురు బాలురను తమవద్దనే చేర్చికొని వారి పుట్టు పేరులను తుడిచివేసి ఇంగ్లీషువారి పేరు కొంత, ముసల్మానుల పేరు కొంత చొప్పున చేర్చి వారికి పేరులు పెట్టిరి. ఆ బాలురే విలియం వహబ్, చార్లెస్ వహబ్, హెన్రీ వహబ్ ఇత్యాదులు. ఈ వహబులందరును గొప్ప గొప్ప యుద్యోగములు చేసిరి. ఆ వహబులలో నొకడైన విలియం వహబ్ రామేశ్వర రాయల వారికి మేనల్లుడు. ఆ విలియం వహబు మేనల్లుడే యీ బాలుడు - అనగా వేంకట రామారెడ్డి.