38
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
ఉపమానము బహుసుందరము. పొగడపువ్వును చూడనివా రీకాలంలో చాలామంది! చూచిన వారికి దీనిని సాలెపురుగుతో నుపమించుట యానందమిచ్చును. కాని మరొక కథయిందు దాగినది. ఒంటి సాలీడు. ఇంటిలో తాను తప్ప మరెవ్వరు లేరు. అందుచేతనే సాలీడింటి నిండుగా వలనల్లినాడు. “అత ఏవ సురుచిరం రతోత్పవో౽నుభూయతాం ఇత్యర్థోధ్వన్యతే. అందుచే నిర్భయముగా ఆనందింప వచ్చునని హెచ్చరిక!
లోభివాని చేతిలో సిరియెంతగా
వెలయుచున్న సుంతఫలము లేదు
తెరువునడుచు వేళ కరకు వేసవియెండ
మాడువానికి నీడవోలె.... 2-36
ఇది మంచినీతియే! అందులోను మంచి యుపమానముతో గూడిన నీతియే!
ఒకదూతి లోభివిటునికి చల్లగా మెల్లగా సూచించినది. నీవు విరివిగా ధనమును
వ్యయించకున్న ఆ సుందరి లభింపదు! ఈ దూతియు ఊరక రాయబారులు
జరుపజాలదు!!
ఊర గొడుకు లేక యుండగ కోడలు
వచ్చి కాళ్ళు మ్రొక్క వంగినపుడు
గాజులెల్ల జారగా జూచి కడు గోప
కత్తె యయ్యు నేడ్చె నత్తగారు. 5-93
మూలములో వలయద్వయమని కలదు. చేతికొక్కొక గాజుండ ననవలెను.
కాని తెనుగు సేతలో గాజులెల్ల అన్నారు. రెండు గాజులేమి! గాజులన్నియు జారినవని
వారి యభిప్రాయమై యుండును! కృశించి కృశించి సన్నగిల్లుటవలన గాజులెప్పుడో
జారిపడి పగిలిపోగా సౌభాగ్య చిహ్నముగా రెంటి నా సౌభాగ్యవతి మగనిమీద ప్రాణము
నిలుపుకొన్నట్టిది. ఎటులో నిలుపుకొన్నది. ఆ యవస్థను కోపగత్తెయగు నత్త యెందుకు
చూచును? ఏదో నిమిత్త కారణముగా తనను మ్రొక్కవచ్చినపుడు బాగుగా సన్నగిల్లిన
చేతుల చూడగలిగినది. అప్పుడైనను కోడలిపై కరుణగలిగినదో లేదో? తన కొడుకు
జ్ఞాపకము వచ్చి వాని బహుకాల ప్రవాసమును తలచుకొని యేడ్చియుండును. ఒక
యేకాంకికకు కావలసినంత కరుణారసమిందున్నది.