మావూరు
369
వైద్యము సకలార్తి నివారక మగుటచేత అతని పేరులోని మొదటి రెండక్షరాలను తారుమారుచేసి అంటూ ఉంటారు. మా యూరులో పారే నీరు లేదు. కాని మూడుమైళ్ళ దూరాన ఆ నీరు దొరుకును. మాకు 10 మైళ్ళ దూరములో ఇటికేల అనే గ్రామమున్నది. పొరపాటు పడకుండుటకై యా గ్రామాన్ని ఆకుచోట ఇటికేల అంటారు. మా గ్రామాన్ని నీళ్ళు లేని యిటికేల పాడు అంటారు. కారణమేమనగా మా గ్రామములో ఎంత ప్రయత్నము చేసినా ఊటబావి పడనే లేదు. తుదకు 150 ఏండ్ల క్రిందట గ్రామానికి రెండు ఫర్లాంగుల దూరములో ప్రక్క గ్రామమగు జల్లాపురంలోని ఇట్టేలవారు అనే కోమట్లు తదేక దీక్షతో పాతాళం చూచేవరకు వదలకుండా త్రవ్వించగా అచ్చటవారికి పాతాళగంగాదేవి ఉగ్రరూపములో విసుగుతో ప్రత్యక్షమయ్యెను. అట్టి బావికి లెక్కపెట్టగా 120 మెట్లు కలవు. నీరు చాలా ఉప్పుగా నుండును. నీటిని బాగా కాచి ఆవిరిగా ఎగిరిపోవునటుల జేస్తే చక్కని తెల్లని ఉప్పు దొరకును. ఉప్పు సత్యాగ్రహం చేసేవారు మా బావి నీటిని కాస్తే శిక్షించేవారు లేరు. మా సర్కారు వారితో 40 ఏండ్ల నుండి లబలబ మొత్తుకొనగా రెండేండ్ల క్రిందట కాస్త వినిపించుకొని ఒక బోరింగు మిషను తెచ్చి 80 అడుగుల లోతు కొట్టితే అచ్చట అర్ధగజం లోతుగల ఉప్పునీరు దొరికెను. ఇంకా లోతుగా కొట్టవలెనయ్యా అంటే వచ్చినవారు మాకు ఎక్కువ లోతు కొట్టే హుకుం లేదు అని 4 నెలల వరకు తమకు వెళ్ళి రమ్మను హుకుం వచ్చేవరకు ఈగల జనాభాను వ్రాసుకొని వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిన వారం దినాలలో ఊరి పిల్లలు రాళ్లు వేసి ఆ కాస్త బోరింగును మూసివేసిరి. మా గ్రామములో 400 హరిజనులు కలరు. వారికి బావిలేదు. పై జాతుల వారిని బావివద్ద ఎంతో ప్రాధేయపడగా హరిజనులకు తిరిపెముగా కాస్త నీరు పోస్తున్నారు.
మాయూరిలో ఎవరి పప్పు కూడా ఉడకదు. అందుచేత ఊరి బయట ఒక పెద్ద గుంతను గ్రామస్థులే చందాలు వేసుకొని సగటున ఏటేటా 500 రూపాయల వరకు వ్యయం చేసి అందు వాననీ రాపుకొందురు. ఆ మురికి నీరే పప్పునకు, త్రాగుటకు, బట్టలుతుకుటకును, స్నానాదులకు. అంట్లు కడుగుటకు వాడుకొందురు మా ఉప్పు నీటిని త్రాగినవారికి ఒక్కసారికానేకాదు రెంటి నుండి పది వరకు ప్రతివానికి నారి పుండ్లు ఏటేటా అవుతూ వుండును. ఎవరో కొందరు మాత్రమే అగస్త్యులవలె నారి పుండ్లను బయటికి రానీయకుండా లోననే జీర్ణోభవ అని మంత్రించుకొనేవారు.