340
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
తనమాట దక్కించుకొనవలెను. లేకున్న తన తలకూడ పోవచ్చును. మరునాడే ఆ గుట్టకు పోయి గుడిలోని హిందూ దేవత విగ్రహాన్ని ఎత్తి పారవేయించి మసీదువలె మార్పించి ఒక జెండా పాతించి దానిచుట్టును ఒక ఆకుపచ్చని బట్ట కట్టించి అంతయు సర్వసిద్ధము చేయించినాడు - గురువారము రానే వచ్చెసు. ఆనాడు హజరత్ ఆలీగారి 13వ రజల్ దినము. కావున గుట్ట వద్ద పాదుషా బీదలకు అన్నదానము బాగుగా చేయించినాడు. ఈ విధంగా అది ఏర్పడెను. ఆనాటి నుండియు మౌలాలీఉరుసు అనుపేర సుప్రసిద్ధముగా అదే స్థలములో జరుగుచున్నది, కారణం తెలియకున్నా హిందువులును అచ్చట సేవ చేసుకొని పోవుచుండుటయు ఒక విశేషము.
భాగ్యనగరము
మన ఆంధ్రులు చాలామంది హైదరాబాదును “భాగ్యనగర” మని కూడా ఇప్పటికి వ్యవహరించుచున్నారు. బహుశ చాలామందికి దాని కారణము తెలియక పోవచ్చును. 988 హిజ్రీలో ఇబ్రహీం ఖుతుబుషా చనిపోయెను. అతని కుమారుడు - భాగమతి అను బోగము దాన్ని ఉంచుకున్న మహామ్మదుఖులీ ఖుతుబుషా అనువాడు రాజయ్యెను. భాగమతికి తానున్న చోటనే నగరము నిర్మించవలెనని కోరిక పుట్టెను. మహా సౌందర్యవతి, పాదుషాగారు చేపట్టిన యువతి, బోగముది. కోరికలు వృథా పోవు. పాదుషాగా రిట్లాజ్ఞాపించినారు. “గోలకొండ ఇరుకటంగా ఉంది. మా దర్జాకు తగినట్టుగా లేదు. అమీర్లకు ఇబ్బందిగా వుంది. నదికి అవతలి భాగంలో నగర నిర్మాణం చేయవలసింది. నాలుగు బాటలు నాలుగు వీధులుండవలెను. నాలుగు కమానులు నాలుగు దిక్కులు కట్టవలెను. 14000 దుకాణాలుండవలెను. 12000 మొహల్లాలు (వాడలు) ఉండవలెను” అని ఆజ్ఞాపించెను. నగరము సిద్ధమయ్యెను. రెండు కోట్లకన్న యెక్కువగా రూపాయీల వ్యయమయ్యెను.
చార్‌కమాను
పై విధముగా సిద్ధమైన నాలుగు బజారులలోని నాలుగు కమానులనే ఇప్పటికిని చార్‌కమాన్ అని వ్యవహరించుచున్నారు. ఇందలి ఉత్తర దిక్కున కమాను వద్ద ఒక వైద్యాలయమును నిర్మించిరి. పశ్చిమ దిశలో హుజూరు వారి భవనాలు నిర్మించిరి. ఈ నాలుగు కమానుల మధ్య విశాల స్థలమును నందలి ఒక “హౌజును” కట్టిరి.