హైదరాబాదు నగర ప్రాచీన స్థలాలు
339
ఉండెను. దాని యింటికి యువరాజు వచ్చి పోవుచుండెడి వాడు. ఒకనాడు తన అలవాటు ప్రకారము గోలకొండ ఖిల్లానుండి బయలుదేరి దాని యింటికి పోవువాడై మూసీనది వరకు వచ్చెను. వర్షాకాలమగుటచేత నది అప్పుడే నిండి పారుచుండెను. ప్రేమ శక్తి బలవత్తరమైనది. ప్రవాహాన్ని జయించునట్టిది. యువరాజు గుర్రాన్ని ప్రవాహములోనికి దింపి ఇవతలి నుండి అవతలికీ దించి భాగమతి యిల్లు చేరుకున్నాడు. ఈ వార్త చారులు పాదుషాకు తెలిపినారు. తక్షణమే మూసీపై వారధి కట్టవలెనని ఆజ్ఞాపించినాడు. మరొక వర్షర్తువు వచ్చే లోపల అది సిద్ధమయిపోయెను. దానికి రెండు లక్షల (బంగారు హున్నులు నాణెములు వ్యయమయ్యెను). ఈ వారధి 881 హీజ్రిలో కట్టబడెను. దీనినే ఇప్పటికిని పురానాపుల్ అని వ్యవహరింతురు.
మౌలాలీ ఉరుసు
హైదరాబాదులో ఏటేట మౌలాలీ గుట్టపై ఒక గొప్ప ఉరుసు జరుగును. దానికి గాను స్థానికముగా రెండు దినాలు కచ్చేరీలకు సెలవు కూడా ఇయ్యబడును. ముసల్మానులే కాక హిందువులును వేలకొలది ఆ గుట్టకు పోయి ఫాలుహారు చదివించి మ్రొక్కులు చెల్లించికొని వత్తురు. బీదలేకాక మ.ఘ.వ. నిజాం ప్రభువుగారును మౌలాలీ సేవచేసుకొని వత్తురు. ఈ మౌలాలీ గురించి జనులు నానా కథలు అల్లుకొని చెప్పుకొందురు. నిజమైన సంగతి ఇట్లున్నది.
ఇదే ఇబ్రహీం కుతుబుషా కాలములో గోలకొండకు సమీపములో నుండు నొక గుట్టపై ఒక దేవాలయముండెను. ఒకనాడు వెన్నెలరాత్రిలో పాదుషా గోలకొండ పై భాగమందలి “బాలా హిసార్” అను సౌధముపై ఆనందముతో అటునిటు ప్రచారు చేయుచు ఉండెను. అట్టి సమయములో అతనికి ఉత్తరపు దిక్కున ఒక పెద్ద వెలుతురు కానవచ్చెను. ఆ సమయములో రాయారావు అను పేరుగల బ్రాహ్మణుడు పాదుషా వెనుక నిలిచి యుండెను. ఆ వెలుతురేమిటి? అని రాయరావును పాదుషా విచారించెను.
“సర్కార్ ఆ గుట్టపై మౌలాలీ అనే ఫకీరు యొక్క జండా యున్నది. అందుచేత షియ్యాలు అచ్చట అఖండదీపములు పెట్టినారు” అని చెప్పినాడు. “అట్లయితే మనము కూడా రేపు గురువారము నాడు పోయి దర్శనము చేసుకొని వత్తుము” అని పాదుషా సెలవిచ్చినాడు. బ్రాహ్మణుడు, యజమాని సంతోష పడుటకై ఏదో ఒక తప్పుడు కూత కూసి యుండెను. పరివాసవిజల్పితము తుదకు పరమార్థముగా గ్రహించబడెను.