Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/334

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

334

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు

హైదరాబాదు రాష్ట్రములోని పాత దిబ్బలను త్రవ్వించినచో మరికొన్ని చారిత్రక విశేషములు లభ్యమగును. ఇటీవలనే హైదరాబాదునకు 40 మైళ్ళ దూరములో నున్న కొండాపురము అను స్థలము వద్ద కొన్ని ప్రాచీన ఆంధ్ర నాణెములు లభించెను. వాటి ఆధారముచే అచ్చట త్రవ్వించగా 1800 సంవత్సరాల క్రిందటి ఆంధ్ర నగర మొకటి బయటపడెను. ఈ రాష్ట్రములోని రాయచూరు జిల్లాలోని మస్కీ వద్ద అశోక చక్రవర్తి శాసనములు లభించినవి. అవి 2200 ఏండ్లకు పూర్వము నాటివి. రాష్ట్రములోని అతి ప్రాచీన చారిత్రక చిహ్నములలో ఇది ముఖ్యమైనదని చెప్పవచ్చును. అటు ఉత్తర దిశయందుండు ఔరంగాబాదు జిల్లా చాలా ముఖ్యమైన చారిత్రక మండలమై యున్నది. ప్రాచీనకాలమందు దేవగిరి రాజ్యమిందే యుండెను. అంతకన్న ప్రాచీనములో శాలివాహన రాజులు ప్రతిష్ఠానపురమును (నేటి పైఠాన్‌) రాజధానిగా చేసుకొని ఇప్పుడు ఆంధ్ర మహారాష్ట్ర కర్ణాటకలనబడు భాగాలను ఏకచ్ఛత్రాధిపత్యముగా పరిపాలించిరి. ఔరంగాబాదుకు 12 మైళ్ళ దూరములో హిందూస్థానమందలి అగ్రశ్రేణిలోచేరిన కోటలలలో నొకటగు దేవగిరి (దౌలతాబాదు) జిల్లా యున్నది. అచ్చటనే ఔరంగజేబు యొక్కయు, అసఫ్‌ జాహి యొక్కయు గోరీలున్నవి. అచ్చటకి 2 మైళ్ళ దూరములో జగద్విఖ్యాతమైన ఎల్లోరా గుహలున్నవి. మూడు మైళ్ళ పొడవున గట్టులలోనే గుహలను తొలచి ఆలయములను విహారములను నిర్మించినారు. అందు జైన, బౌద్ధ హిందూ శిల్పములున్నవి. క్రీస్తు శక పూర్వము 200 ఏండ్ల నాటినుండి క్రీస్తు తర్వాత 900 ఏండ్ల వరకు ఈ గుహలు నిర్మాణమై యుండెను. అందలి శిల్పాలు అద్వితీయమైనవి. ఆ శిల్పాలలో కైలాసం అను పేరుతో నున్న శిల్పరాజము నిజముగా భూలోక శిల్పములలో కైలాసము వంటిది. ఔరంగాబాదులో బీబీకా మక్భరా అనునది తాజమహల్‌ యొక్క నఖల్‌. అదే నగరములో పూర్వులు చుట్టునుండు గట్లనుండి భూమిలో కాలువలు నిర్మించి నగరమంతటను నిరంతరము ఊట గొట్టముల ద్వారా నీరు సప్లయి యగునట్లు చేసినది నేటికిని అనుభవములోనున్నది. ఔరంగాబాదునకు 60 మైళ్ళ దూరములో అజంతా గుహలున్నవి. అవి రాతిలో కవితను ప్రదర్శించు తావులు. గట్లును వాటిపై నుండు చెట్లును ఆ గట్ల నుండి నిరంతరము ప్రవహించు దివ్య ప్రవాహమున్నూ అరసికుని రసికునిగా క్షణమాత్రమున జేసివేయును. ఇంచుమించు 2000 ఏండ్ల కిందట అచ్చటి గుహలలోని గోడలపైన