Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు


దొరకకుండ నేడు దొరికిన చెంగావి
చీరకట్టె కాపువారి కోడ
లదిగో, చిన్నదయ్యు నడగక తిరిగెడు
విరివియైన యూరి వీధులందు. (3-4)


ఆనాటి పడచుల భావములో నీలిరంగు చీర మంచిది కాదట. పట్టుచీరయయిన భేషట! (6-20) ఉత్తర హిందూస్థానమందు స్త్రీల రవిక కట్టు వీపున నుండెడిది. దాక్షిణాత్య స్త్రీల కంచుక బంధనము ముందువైపే యుండెడిది. ముందు భాగమందు రెండు పార్శ్వములందు కొంత సందు కలిగి పొట్టపై రవిక రెండంచులను ముడివేయుట ఆనాటికే రూఢియై యుండెను. (7-20) “ద్వ్యంగుల లలిత కావాటక, పినద్ధ సవిశేష నీలకంచులికా” స్త్రీలు నూపురములు ధరించుచుండిరి. (2-88)

జనుల యాచారములు కొన్ని

పిడుకల కాల్చుట ప్రాతకాలపు దురాచారమే (2-29). జనులు ముఖ్యముగా స్త్రీలు ఇప్పపూల నేరి సారాయి చేసుకొనుచుండిరి. ఆనాడు ఇప్ప సారాయికి లైసెన్సు లేకుండెనన్నమాట (3-3 మరియు 2-4). ప్రాత సారాయి (జీర్ణ సుర) చాలా రుచికలదై మైకమును మదనోన్మాదమును కలిగించు నట్టిదని యొక కవి యిట్లనెను.


“ఊరినిండ వయసువారు; ప్రాయము; ముదు
సలి మగండు; నవవసంత వేళ;
ప్రాతపడిన కల్లు చేతనున్నది; ఇంక
చెడక చావగలమే; చెప్పవమ్మ. (2-97)


పండ్లు తోముకొనుటకు జనులు కానుగ పుల్లలను వాడుచుండిరి. (2-65, 6-53). స్నానము చేయునపుడు నలుగు పిండిని వాడుచుండిరి. ఆ పిండిని రుద్దుకొని కడుగుకొనినప్పుడు “జంబూకషాయము” ఏర్పడుచుండెను. (2-89) పిల్లలకు అక్షరాభ్యాసము 'ఓనమాల'తో సీధంనమః'తో ప్రారంభమగు చుండెను. (2-9).


“వర్ణావళీమష్య జానంతో లోకాలోకైర్గౌరవాభ్యధికాః
సువర్ణకార తులా ఇవ నిరక్షరా లిపిస్కంధై రుధ్యంతే.