Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాథా సప్తశతి

27

స్త్రీల వేషభూషలు

స్త్రీలు స్నానము చేయునపుడు పసుపు రుద్దుకొనుచుండిరి. (1-80) కన్యలకు తొలి సమర్త కాలమందు పసుపులో నెయ్యి కలిపి ముఖమునకు చేతులకు కాళ్లకును రుద్దుచుండిరి. (3-46) ఇచ్చట మూలమందు “వర్ణఘృత లిప్తముఖం” అను పదముపై శ్రీ మధురానాథ శాస్త్రిగారిట్లు వ్యాఖ్యానించిరి. “హరిద్రావర్ణ మిశ్ర ఘృతం వర్ణఘృతం దేశ విశేష రజస్వలా ముఖం వర్ణఘృతేన, లిష్యతి ఇతికా చిత్ర్పథా” ఉత్తర హిందూ స్థాన మందీయాచారము లేదనియు “ఒకానొక దేశవిశేషమందు” ఈ యాచారముండె ననియు వ్యాఖ్యాత్రభిప్రాయము. ఇది ద్రావిడాచారము. సప్తశతిలో గోదావరీ తీర వాసుల యాచారాలు వర్ణించినందునను నేటికిని ఆంధ్రులలో నీయాచారముండుట వలనను దేశ విశేష నాంధ్రదేశమనుట స్పష్టము (చూడుడు 122 మరియు 619). ముత్తయిదువలు కాళ్ళకు లంకరంగు పూసుకొనుచుండిరి. (2-27) బుక్క పిండిని (కర్పూరాది గంధ ద్రవ్యకృత వర్ణ ధూళి) ప్రియులొండొరులపై చల్లుకొనుచుండిరి. (4-12) విలాసినుల ప్రసాదనములలో అద్దము, దువ్వెన ముఖ్యమైనవి. (3-4 మరియు 1-80) నాట్యమాడు స్త్రీలు ముఖమునకు హరిదళమును (అర్థళము - హరితాల మండిత ముఖీనటీవ) పూసుకొనెడివారు. (1-9) పూర్వమిండ్ల పెరడులందు ఆంకోల (ఊడుగ) వృక్షములు పెంచుచుండిరి. వాటి పూల సువాసన యువతీ జనాహ్లాదకారి (5-97) ముత్తయిదువలు కొప్పుముడిని, జడను వేసుకొనుచుండిరి. (3-73) మరువము స్త్రీలకు ప్రీతికరమైయుండెను. (2-22) ధనిక యువతులు మరకతమణి పద్మరాగ సంవలితములైన (పచ్చల కెంపుల) కంటెలను ధరించిరి. (1-25) మట్టిగాజులను తొడుగుకొను నాచారము తెనుగు ముత్తయిదువలలో నిప్పటికే రూఢమై పోయెను. (5-38) “భగ్నకరవలయాని” అనుటలో భగ్న శబ్దమును బట్టి యవి మట్టి గాజులే యనవలెను. మరియు (5-53) వ్యాఖ్యలోనవి “కాచాది నిర్మితం” అని వివరించినారు.

స్త్రీలకు చీర రవిక ప్రధాన వస్త్రములు. రంగు వస్త్రములపై వారికి ప్రీతి మెండు. కుసుమవన్నె నుత్తమమైనదిగా నీలి వన్నెను సాధారణమైనదిగా భావించిరి. రవికలు “కుసుంభరంజితములు” (6-45) కుసుమవన్నె (చెంగావి) చీర యువతులకు ముచ్చట గొలుపునట్టిది.