Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు

అమరుడు అను రాజు చావగా అతని శరీరములో పరకాయ ప్రవేశవిద్యచే ఆదిశంకరాచార్యులు ప్రవేశించి అమరు రాజై అతని భార్యతో సుఖించి యీ శతకము వ్రాసెనని యొక అద్భుత కథకు విచిత్ర రూపమేర్పడినది. ఇదంతయు నవిశ్వసనీయము. శంకరుని కాలము 700-800 మధ్యకాలము. అమరుని ఆనందవర్ధన, మమ్మటాదులు గ్రహించినందున వారిరువురు క్రీ.శ. 10-11 శతాబ్దముల వారగుటవలన అమరుడు క్రీస్తు శకము 700 ఆ ప్రాంతము వాడనిన పొరపాటుండదు. అమరుడెవ్వడో తెలియదు.

విహారి సత్సయీ వ్రాసిన విహారి కవి యెప్పటివాడో తెలియదు. అమరు గోవర్ధనుల తర్వాత వాడని మాత్రమే భట్టశ్రీ గారన్నారు. సత్సయీలోని భాష యిప్పటి హిందీకి చాలా దూరముగానున్నది. కబీరు, తులసీదాసుల భాష కన్న చాలా ప్రాక్తన మైనది. కావున అది క్రీ.శ. 1200-1300 ప్రాంతముదిగా నుండును. సత్సయీలోని చాలా దోహలు (ద్విపదలు) గాథా సప్తశతి నుండి యేర్పడినవే యని భట్టశ్రీ గారెత్తి చూపినారు.

తెనుగు సేత

శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు అసాధారణ కవి పండితులు. సంగీత సాహిత్య విద్యానామక యుగళంబు గ్రోలినవారై బహు భాషలను, ప్రాకృతమును నెరిగిన వారగుటను, తెనుగున ఉత్తమ వచన శైలిని, మధుర కవితను నల్లగలిగినవారు. వారు గాథా సప్తశతిలోని 395 పద్యముల నేరి తెనుగించినారు. వారి విచక్షణ సరియెనదే. పచ్చి శృంగారమును, అనవసరమగు పద్యాలను, అనుత్తమమైన వాటిని పరిహరించినారు. మూలమందలి భావములను అందలి గంభీరతను చెడకుండా సుందరముగా సులభ గ్రాహ్యమగునట్లుగా చేతికందించినారు. వారే దానికి పీఠిక వ్రాయవలసి యుండెను. అటులే కొంత చేసినట్లే! శ్రీనాథుని కృతియుత్సన్నమైన వ్యధను వీరు తొలగించినారు.

నాటి ఆచారాలు

గాధా సప్తశతి యొక్క కాలమును నిర్ణయించినాను. కావున ఆ కాలమందలి సాంఘికాద్యాచార విశ్వాసము లెట్టివో సప్తశతిలోని వర్గలను బట్టి మనము స్పష్టముగా నిరూపింపవచ్చును. గాథలన్నియు నుద్దేశ పూర్వకముగా శృంగార భూయిష్టముగా సంకలింపబడినందున నా కాలమున జనులందరు శృంగారలంపటులని తలపరాదు.