గాథా సప్తశతి
సంస్కృతమందు కాని, ప్రాకృతమందు కాని, దేశభాషలందు కాని గాథా
సప్తశతితో సమానమగు కవిత లేదు. శాలివాహన చక్రవర్తులలో నొకడగు హాలుడు
తన యాస్థానమందును తనకన్న ముందు కాలమందును నుండిన కవుల యొక్కయు
కవయిత్రుల యొక్కయు ప్రాకృత పద్యముల నేర్చి కూర్చి యందు తన సొంత
పద్దెములను కొన్నింటిని జేర్చి 800 పద్యముల పరిమితిగా సంకలించి ప్రపంచాని
కందించెను. అదే గాథా సప్తశతి. హాలుడు తనను గూర్చి యేమియు తెలుపుకొనలేదు.
ప్రతి శతకానంతర మొక పద్యములో తాను సంకలన కర్తనని మాత్రము తెలుపుకొనెను.
“రసిక జన హృదయ దయతే
కవివత్సల ముఖ సుకవి సంకలితే”
అని ప్రథమ ద్వితీయ తృతీయ పంచమ షష్ట శత కాంతములందును “నరపాల
హాల రచితే ప్రాకృత కావ్యేత్ర సప్తశతే' అని సప్తమ శతకాంత మందును “అత్ర
చతుర్థం విరమతి నిసర్గ రమ్యం శతం హిగాథానాం! మధురత్వేనామృత మపినోలగతి
హృదయే” అని చతుర్థ శతకాంతమందును వ్రాసెను. ఈ పద్యములు నిసర్గ
రమ్యమైనవనియు వాటి మాధుర్యము ముందర అమృతము కూడ చప్ప చప్పనిదే
యనియు కవి హృదయము.
పై శ్లోకాలలో “కవివత్సల ముఖ సుకవి సంకలితే” అనునది యను మానమునకు తావిచ్చినది. రాజులు మందులనియు కవులు యశః కాముకులనియు, ఇతరులచే వ్రాయించిన కవితలకు పైకమిచ్చి తమ పేర్ల నతికింతురనియు, మన దేశమందు కథలల్లినారు. ఆ కథలలో నీ కథయు చేరినది. హాలుని యాస్థానమందు కవి వత్సలుడో, శ్రీపాలితుడో యొకడుండెననియు, అతడే సంకలనకర్తయనియు, హాలుని పేరు ద్రవ్యాశచే తగిలించె ననియు నందురు. కాని యది నిరాధారము, శతకాదియందే హాలుడిట్లు వ్రాసెను.