సుమతి శతకము
157
“శ్రీవిభుడ, గర్వితారి
క్షాపర దళనోపలబ్ధ జయలక్ష్మీ సం
భావితుడ, సుమతి శతకముఁ
గావించిన ప్రౌఢ, గావ్య కమలాసనుడన్”
శ్రీ.మా. రామకృష్ణ కవిగారన్నట్లుగా సుమతిశతకము యొక్కయు నీతి
శాస్త్రముక్తావళి యొక్కయు శైలిలో చాలా భేదము కలదు. అందుచేత సుమతి
శతకమును ముందు రచించి తర్వాత నీతి శాస్త్ర ముక్తావళిని రచించి యుండిన
సుమతి శతకములోని శైలీ సూచక పదజాలము కొంతయైనను రెండవదానిలో
పడవలసి యుండవలెను. అట్టి జాడలేవియు గానరావు.
భీమకవి వ్రాసెననుటకు తాళపత్రపద్యము లేవియు శ్రీకవిగారుదహరింప
లేదు. మరియు వేములవాడ భీమకవియు చాలా ప్రాచీనుడు. నన్నయ తిక్కనల
కాలపు శైలియే వేరు. సుమతిశతకములోని శైలి శ్రీనాథుని యనంతర శైలిగా
కానవస్తున్నది. కాళిదాసుని గురించి మనకెంత తెలియునో తుదకు సుమతి శతక
కర్తను గురించియు మనకంతే తెలిసినదనవలెను.
కవియెవ్వరో తెలియనప్పుడు కవి కాలమెట్లు తెలియును. అయినను
శతకములోని శైలినిబట్టి కొంత యూహింపవచ్చును. భద్ర భూపాలుడు క్రీ.శ. 1150కి
పూర్వమందే ఉండిన వాడనియు అతనిని అతని పద్యాలను నీతి సారములో
రుద్రదేవుడును సకల నీతి సమ్మతములో మడికి సింగనయు మరికొందరును
నుదాహరించిరని ఆ కవిగారు తెలిపినారు. సింగనాదులు సుమతి శతకము నుండి
పద్యాలనేల యుదహరింపలేదు. మడికి సింగన తర్వాతిదే ఈ సుమతి శతకమని
చెప్పవచ్చును. నీతి శాస్త్రముక్తావళిలో తిక్కనయు నతనికి పూర్వులును వాడిన
పదాలెక్కువగా కలవు. కెలసము, పొరచి, ఎత్తికోలు, పురులు, ఒరిమే, కురగట,
మున్నగు బహు ప్రాచీన పదములతడు వాడినాడు. అయితే ఈ పదాలను తిక్కన
తర్వాతి వారును వాడిరని పరిశోధించి చూపించ వచ్చును. కాని అవి పరిశోధన
శ్రమకు లోనైనవే యగును. శతకములో నిట్టి శబ్దాలు కానరావు.