Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దశకుమార చరిత్రము

సంస్కృత వాఙ్మయమందే దశకుమార చరిత్రము వంటి రమ్యమైన కథలు కలిగిన గ్రంథము లేదనిన నింక తెనుగు విషయము జెప్ప నవరసమే లేదు. తెనుగు నేటివరకు నొక యనుకరణ భాషగానున్నది. నాడు సంస్కృతము దీనికి మార్గదర్శకమైన నేడు ఇంగ్లీషు బంగాలీ భాషలా స్థానము వహించినవి. సంస్కృతమందు హితోపదేశ కథాసరిత్సాగర బృహత్కథా కాదంబరీ కథల వంటి వనేకములు కలవు. కాని యవియు నీ దశకుమార చరిత్రలోని కథలలో నొక్కొక్కటి యొక్క నవలకు మూలాధారము కాదగినది. నేటి నవలా కర్తలిట్టి కథలనే పెంచి సాహస కథలనుగా (Novels of Adventure) వ్రాయుచున్నారు. ఈ కథలలో రాజవాహనుడు పాతాళలోకమునకు బోవుట, ఒకమంత్రి యక్ష స్త్రీని వివాహమాడుట, ఒక బ్రాహ్మణ బ్రువుడు యమలోక మేగి వచ్చుట, నిట్టి యంశములు నాలుగైదు ఆవిశ్వసనీయములైన వానిని వదలిన దక్కిన భాగమంతయు నేటి నవలా కర్తలు సమ్మతించునవే యైయున్నవి.

కథలు వ్రాయు కవులకు ముఖ్యముగా గథా మాత్రము నవిచ్చిన్నముగా నడపుట (Narration) దానికనుకూలమగు సులభశైలి యీ రెండును నవసరములు. మన తెనుగు ప్రబంధములలో నూటికి తొంబది తొమ్మిది ప్రబంధములోని కథలు “పిట్టమ్మ కాకమ్మ కథల వంటివి”. మన కవులు కథా చమత్కృతిని చాటింపక శైలి చమత్కృతిని బూజించిరి. సంస్కృతమందును కాదంబరి యిట్టి గ్రంథమే. బాణుడు కథలు జెప్పుచు జెప్పుచు మధ్యన నలుబది యేబది పుటలే సరోవర వర్ణనమునో, యే రాజకుమారోపదేశమునో వర్ణించును. ఈ వర్ణనలును దెగబారెడు సమాసములతో నిండియుండును. చదువు వారికి విసుగు పుట్టుట తుది ఫలితము. మన దశకుమార చరిత్ర మట్లు కాదు. వర్ణనాంశము లిందు తక్కువ. శైలి నాతికఠినము. కథ మనోహరము. స్వాభావికము. ఇది సంస్కృత దశకుమార చరిత్ర సంబంధమగు చర్చ.