Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలంగాణ వైతాళికుని వ్యాస ప్రదీప్తి


తన కలం ద్వారా సుప్త తెలంగాణమును మేలుకొల్పిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. ఆయన బహుముఖ ప్రజ్ఞానిధి. పత్రికా సంపాదకుడు. పరిశోధక వతంసుడు. సంఘ చరిత్ర నిర్మాత. స్వాతంత్ర్య సమరయోధుడు. అది ఆంధ్ర మహాసభ కానీ, గ్రంథాలయోద్యమం కానీ, లిపి-భాషా సమస్య కానీ, విద్యార్థి వసతిగృహ స్థాపన కానీ - ఆయన కృషి సల్పని రంగం లేదు. అయితే ప్రతాపరెడ్డిగారు ప్రధానంగా పాత్రికేయులు. గోలకొండ పత్రికను ఆలంబనగా చేసుకొని వారు తన ఉద్యమాలను కొనసాగించారు. చెన్నపట్నం నుండి కాశీనాథుని నాగేశ్వరరావుగారి ఆంధ్రపత్రిక, మచిలీపట్నం నుండి ముట్నూరి కృష్ణారావుగారి కృష్ణాపత్రిక ఏ విధంగా తెలుగుజాతి ప్రగతికి దోహదం చేశాయో, భాగ్యనగరం నుండి గోలకొండ పత్రిక కూడా ఆ విధంగానే సమాజ చైతన్యానికి సహకరించింది.

ప్రతాపరెడ్డిగారు నిరంతర జిజ్ఞాసువు. నిశితమైన పరిశీలనా చక్షువు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, రామాయణ విశేషములు, హిందువుల పండుగలు ఆయన పరిశోధనా శేముషికి నిదర్శనాలు. ఇవేకాక వారి ప్రతిభకు పతాకలైన వ్యాసాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. అయితే అవన్నీ పాత పత్రికల పుటల్లో, వ్రాతప్రతుల రూపంలో చెల్లాచెదరుగా ఉన్నాయి. అవి వెలుగులోనికి వస్తే వారి పరిశోధనా వ్యక్తిత్వం ఎంత విశిష్టమైనదో నిరూపితం కాగలదు. వారిలో ఎంత విద్వత్తు నిక్షిప్తమై ఉన్నదో వెల్లడి కాగలదు.

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు మొదటి భాగం వారి సాహిత్య వ్యాసాల నుండి ఏరిన ముత్యాల సంపుటం. ఇవి 1922-53 మధ్య 30 సంవత్సరాల కాలంలో వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి. ప్రతాపరెడ్డిగారు గోలకొండ పత్రిక (1926-47)లోనే కాక సమకాలీన పత్రికలు పెక్కింటిలో రచనలు వెలువరించారు. వానిలో పేర్కొన తగినది పి.ఎన్‌. శర్మ, గడియారం రామకృష్ణశర్మగారి సంపాదకత్వంలో వెలువడిన సుజాత (1927-30, 1950-53). పి.వి. రాజమన్నార్‌ గారి 'కళ' (మద్రాసు-1922)