Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు

26. అరి కంఠము

తల చెవులు మూసుకొనునటుల వస్త్రమును చలినాపుటకు చుట్టుకొనుట కందురు. ఇది నిఘంటులలోలేదు.

27. మాంగో

మామిడి పండు అను నర్థము కల ఇంగ్లీషు పదము. ఇంగ్లండులో మామిడి చెట్లు పండ్లు లేవు. ఈ పదాన్ని మన దేశమునుండి తీసుకొనిపోయి యుందురు. మచిలీ బందరులో మొదట ఇంగ్లీషువారు మొఖాము వేసిననాడు తెనుగువారి నుండి మావికాయ మాగాయ అని దాని పేరు తెలుసుకొని దానినే ఆంగో అని మార్చుకొని యుందురు.

28. దుముదారు

rear guard అని యింగ్లీషులో దానికి సరియగు పదము. సేనకు వెనక భాగమందుండి శత్రువుల నుండి రక్షించుటకై నియుక్తులగు సేనానుల కీ పదమును విజయనగర చక్రవర్తుల కాలములో వాడినారు.


“సకుటుంబముగ వీగి చరమ శైలము చేరు
తుహినంవు దుముదారు దొరయనంగ”

మనుచరిత్ర. ఆ ౩ ప. 54


ఇచ్చట దుముదారు అన సేనానాయకుడని అర్థము వ్రాసినారు. సేనకు వెనక దిక్కుననుండు రక్షక సేనాని యనుటయే స్వారస్యము. దుముదారు అనునది దుందార్‌ అను ఉర్దూ పదము. దుం అనగా తోక దుందార్‌ అనగా తోక దిక్కుండువాడు అని యర్థము.


29. తాయెతు


దీన్ని గూర్చి అప్పకవి ఒక వ్యుత్పిత్తిని చెప్పసాహసించెను. “ఎత్తులనగా దక్షిణ దేశీయమున దండలకు పేరు. దాని జడ్డన తేలబలికిన ఎతులాయెను. తాయి అనగా తల్లి. ఆ తాయి శిశువులకు శరీర రక్షగా కట్టునవి యెత్తులు కనుక తాయెతులు” అని వ్రాసెను. అప్పకవి తనకు పూర్వము ముద్దరాజు రామన తాయెత్తును తాయతు