Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శబ్దాల ముచ్చట

125

22. మేజువాణి

ఉత్తర సర్కారులలో భోగము సానుల ఆటకు మేజువాణి యందురు. ఇది ఉర్దూలోని మేజ్‌బానీ అను పదము యొక్క అపభ్రంశరూపము. మేజ్‌బాన్‌ అనగా విందునిచ్చువాడు. మేజుబానీ అనగా విందు. సాహెబులలో విందులలో పూర్వము నాచ్‌ ప్రధానముగా నుండెను. అందుచేత మనవారు సానుల ఆటకు వారి పాటకచ్చేరీకి మేజువాణి అని పేరు పెట్టినారు.

28. పోఱి

బాలిక అని అర్థము. ఇది అల్పార్థమందు తక్కువ వారి పిల్లలను పిలుచుటకై వాడుదురు. కాని పూర్వము గొప్పవారి కూతుండ్ర కీ పదమును వాడిరి. వేంగీ చాళు క్యులలో మంగిరాజు క్రీ.శ. 701-725 వరకు వేంగీ రాజ్యమును పాలించెను. అతని కూతురు పేరు “పృథివీ పోఱి” అని అతని శాసనములో వ్రాసినారు. పోఱి శబ్దము ఇప్పుడు తెలంగాణాలో చాలా ప్రాంతాలలో విరివిగా వాడుకలో కలదు. పిల్లవానిని పోఱడు, పోఱగాడు అని యందురు.

24. వంద

నూఱు యని యర్థము. ఈ పదము భారతములో కానరాదని నా నమ్మకం. ఇతర పూర్వ కవులలో, మధ్యకాలపు కవులలోను ఇది కానవచ్చినటుల నాకు తోచదు. మరి యిదెట్లేర్పడెను? ఈ పదము తెలంగాణాలో, రాయలసీమలో జనసామాన్యమందు వాడుకలో లేదు. ఉత్తర సర్కారు వారిని జూచి తక్కిన వారు వందయనుటయే బాగని ప్రయోగించుటకు నేర్చుకొనుచున్నారు. బహుశ బృంద (సమూహము) అను పదము యొక్క తద్భవముగా ఈ వంద అను పదమేర్పడెనేమో?

25. కరడా

ఇప్పుడు బళ్ళలో కాపీలు వ్రాయింతురు. అందుచేత కాపీ వ్రాయుట అని మనము వ్యవహరించుతున్నాము. కాని మనకు కాపీ శబ్దమునకు సరియగు పదము కలదు. అదే కరడా అను పదము. ఈ శబ్దము నిఘంటులలో లేదు. తెలంగాణాలో ఇది విరివిగా ప్రయోగింపబడుతున్నది. అక్షరాలు బాగా కుదురుటకై మంచి అక్షరాలను ఒరవడిగా నుంచుకొని వ్రాయుటకు కరడాలు వ్రాయుట అని యందురు.