Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శబ్దాల ముచ్చట

123

పేరుల తుదిలో నుంచుచునుండిరి. మోరో పంథ్ వంటి విట్టివే, పంథ్ బహువచనము మన పంతులు అయి యుండును. ఇది గోలకొండ నవాబుల కాలములోను పీష్వాల కాలములోను తెనుగు దేశములోనికి వచ్చినట్లున్నది.

9. ఫిరంగి

ఇంగ్లీషులో క్యానన్ అందురు. ఈ పదము ఫ్రెంచివారి నుండి యేర్పడినది. ఫ్రెంచి వారే ఫిరంగీలు, వారు తెచ్చిన మారణయంత్రమే ఫిరంగి. ఈ పదాన్ని క్రీ.శ. 1600 తర్వాత కవులెక్కువగా వాడినారు. అంతకు పూర్వమీ పదము మన వాఙ్మయములో లేదు.

10. గేరి

వాడ, వీధి అని యర్థము. రాయలసీమలో, మహబూబ్‌నగర్ జిల్లాలో వాడుదురు. మాదిగగేరి, బాపనిగేరి, కాపుగేరి అని కన్నడములోని కేరి అనుపదమే గేరి అయినది.

11. కురువ

గొల్లజాతిలోని ఒక జాతి. కన్నడములో కురి అనగా గొర్రె. కురికి సంబంధించిన జాతి కురువగా ఏర్పడియుండును.

12. అడకొత్తు

కన్నడములో అడకె అనగా వక్క, దానిని ఒత్తునది అడకొత్తు.

13. క్రమేలక

ఒంటె ఇంగ్లీషులోని క్యామెల్ అనునది దీనికి దగ్గరి పదము. ఇది సెమిటిక్ భాష నుండి సంస్కృతములోని కెక్కిన పదమని భాషాతత్వ శాస్త్రవేత్తల అభిప్రాయము.

14. మేలా

సంస్కృతములో మసి-సిరా-అనుదానికి వాడుదురట. మేలాంధుక అనగా మసిబుడ్డి (Ink pot) అట. ఇది గ్రీకు భాష నుండి సంస్కృతములోనికి వచ్చినదట.

15. లిపి

ఇది పురాతన ఫార్సీ నుండి సంస్కృతములోని కెక్కెనని భాషాశాస్త్రవాదుల వాదము. పాణిని నాటికిది మన సంస్కృతములో నుండినట్టిది.