శబ్దాల ముచ్చట
117
4. దేవానాం ప్రియ - ఇది షష్ఠీ తత్పురుష అలుక్సమాసముగానే మూర్ఖుడను నర్ధములో వాడినారు. అమరసింహుడు త్రికాండ శేషములో దీని యర్థము “ఛాగము” అని వ్రాసెను. ఛాగసమానుడు మూర్ఖుడు. మరియు ఛాగము యజ్ఞములందు దేవానాం ప్రియమైనది. నిఘంటుకారులు మూర్ఖునికే యీ పదము అలుక్సమాస స్పరూపమందే వర్తించుననిరి. దీనికి చారిత్రక కారణము కలదు. బౌద్ధులు తమ మతమందు శ్రేష్ఠులైన వారిని “దేవానాం ప్రియులు” అని పిలుచుచుండిరి. ఆశోక చక్రవర్తి బిరుదులలో నిదొక్కటి. హిందువులు బౌద్ధులను హేళనము అవమానము చేయు నుద్దేశముతో నీ యలుక్సమాస మూర్ఖనిర్వచనము చేసి యుందురు.
5. హజారము - దర్బారు అను నర్ధములో వాడుదురు. ఫార్సీ హుజూరీ నుండి వచ్చియుండును.
6. హసాదు - “చిత్తము అట్లే” అను నర్థము హాస్రాబ్ అను దానినుండి యేమో?
7. చొక్కా - అంగీ, ఫార్ఫీలోని “చొగా” నుండియే వచ్చినది. నిస్సందేహము.
8. కాగితము - ఫార్సీ - కాగజ్ నుండి
9. బులాకి - ముక్కుకొనను అలంకారముగా (?) వాడుకొను ఆభరణ విశేషము. ఫార్సీలో “బులాఖ్” ఈ ఆభరణమును ముసల్మానులే తెచ్చి ఈ దేశ స్త్రీల ముక్కుల కెక్కించినారేమో, ఆలోచించుడు.
10. కందిల్ - హైద్రాబాదులో ప్రయుక్తము దీపమని యర్థము. ఇంగ్లీషు క్యాండిల్ (Candle) నుండి వచ్చినదీ వెలుగు.
11. గడ్డినూనె - ఉత్తర సర్కారులలో నున్నదో లేదో కర్నూలులో నిజాం రాష్ట్రంలో కొన్ని భాగములలో కిరోసిన్ నూనెకు పర్యాయపదముగా నున్నది. కిరోసిన్ నుండి గ్యాస్ కూడా వచ్చును. కావున గ్యాసును ముసల్మానులు 'ఘాస్‌నూనె'నుగా జేసిరి. ఉర్దూలో ఘాస్ (ఘాసశబ్దమే) అనగా గడ్డి కావున కిరోసిన్ గడ్డినూనె అయినది.
12. చీనా గొలుసు - ఇది నంబి సోమయాజి వంటి పదము. ఇంగ్లీషు చైన్ (Chain) అనగా గొలుసు. ఆక్స్ (OX) ఎద్దు అన్న చదువు పరిణామమే చైన్ గొలుసు తుదకు చైనా గొలుసు , చీనా గొలుసు అయినది. చీనా దేశమున కిప్పుడిప్పుడే గొలుసు సంబంధము కలుగుచున్నది.