Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శబ్దాల ముచ్చట

మా శ్రీపాద శాస్త్రిగారితో మాటల సందర్భమున నా పుస్తకములో వ్రాసికొనిన కొన్ని శబ్దముల చరిత్రను ముచ్చటించి యుంటిని. కాని వాని నింత త్వరగా ప్రకటించదలచి యుండలేదు. మా శాస్త్రిగారు మాత్రము ఇప్పుడే కావలనెనని పట్టుపట్టినారు. సంస్కృత ఫార్సీ భాషలకు పరస్పర సన్నిహిత సంబంధమెట్లు కలదో, ఈ రెంటికినీ కించిద్భేదమెట్లేర్పడెనో, ఎన్నడేర్పడెనో ఇత్యాది విషయముల నొక చిన్న గ్రంథముగా వ్రాయ తలపెట్టి యుంటిని.

అప్పుడు నేను సంగ్రహించి యుంచిన ఫార్సీ శబ్దములను గురించియు వ్రాయదలచి యుంటిని - అదెన్నడో యేమోకాని యిప్పుడు మాత్రము నాకు తోచిన కొన్ని శబ్దముల నిందు ప్రకటించుచున్నాను. నేను వ్రాసిన అభిప్రాయములు సరిగాకపోవచ్చును. విమర్శకులకు మార్గదర్శకముగ నైన నుండవచ్చునను ఊహతో ప్రకటించుచున్నాను.

1. ద్వార - ద్వి+ అర రెండు రెక్కలు కలది. ప్రాచీనమందు ఒంటిరెక్క తలపులకన్న రెండు రెక్కల తలుపులే విశేషమేమో.

2. డప్పు - ఇది ఉత్తర సర్కారులలో విశేషము వాడుకలో కలదు. ఫార్సీలో దఫ్‌ అని కలదు. తప్పెట అను నర్థములో నుపయోగింతురు.

3. హంవీరుడు - శూరుడను నర్థములో ప్రయుక్తము. తారా శశాంక విజయమందు ప్రయోగించబడినది.

“దండ హంవీర తలగుండు గండ” అని శుకసప్తతిలో (పు. 128) కలదు. “రాజమాన్య హంవీరులు దక్కణీలు” అనియు నొక చాటువు. హంవీరుడు రాజపుత్ర స్థాన చిత్తూరు రాజగు అర్సికుమారుడు. మహావీరుడగుటచే శూరపద పర్యాయ మయ్యెను.