Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జీవిత చరిత్రలు - వాటి రచన

109

హిందువులలో చరిత్రలే లేకుండెనను అపవాద మున్నందున ఇక జీవిత చరిత్రల కెక్కడ తావున్నది. హిందువులు ఒక విధముగ ప్రపంచములో మొట్టమొదట జీవిత చరిత్రలు వ్రాసినవారు. కాని ఆ మాటను నమ్మకుండునట్లుగా తర్వాత మనవారే చేసి వేసినారు. మన పురాణములు జీవిత చరిత్రలతో నిండియుండెను. రామాయణము శ్రీరాముని జీవిత చరిత్రము కాదా? దానిని చదువని లేక వినని హిందువు లేడు కదా! భాగవతము శ్రీకృష్ణుని జీవిత చరిత్రము, దానిని విననివారు అరుదు. హరిశ్చంద్రుని చరిత్ర, నలచరిత్ర, అజామిళుని చరిత్ర ఇట్టివి వేలకొలది కలవు. అవన్నీ జీవిత చరిత్రలే! కాని హిందువులలో ఒక లక్షణమున్నది. తమకు నచ్చిన వారిని దేవతలుగా చేసిరి. మెచ్చని వారిని రాక్షసులుగా చేసిరి. ఆ చేయుటలోనూ మహిమలతో పూర్తిగా నింపివేసిరి. ఈ కారణాలచేత నిజమైన చరిత్ర మాటుపడి, నమ్మరానిదై పోయెను. అంత ప్రాచీన కాలపు ముచ్చట్లు వదలినా నిన్న మొన్నటి అనగా 200 ఏండ్ల క్రిందటి చరిత్రలు కూడా మనవారట్లే వ్రాసిరి. తుకారాం విమానములో సశరీరుడై పోయెనట. నామదేవుడు బఱ్ఱెచేత వేదాలు చదివించెనట. ఇవన్నీ భక్త విజయములో చూచుకొనవచ్చును. వైష్ణవులను చూచి శైవులు, శైవులను చూచి వైష్ణవులు భక్తుల చరిత్రలను కొల్లులుగా వ్రాసిరి. ఇక మనవారి రెండవలోప మేమనగా జీవిత చరిత్రలను ఉన్న దున్నట్లుగా వ్రాయక ఉత్ప్రేక్షలతో అబద్దాలతో నింపివేసిరి. విక్రమాంకదేవ చరిత్ర, మహ్మద్‌ మదమర్ధనం, శంకర విజయము, వేమభూపాల చరిత్ర, హర్షచరిత్ర, సాళువాభ్యుదయము, పృథ్వీరాజ విజయము మున్నగు సంస్కృత జీవిత చరిత్రములు వందలకొలదిగా నున్నవి. అవి కొంతవరకే పనికి వచ్చును.

అజ్ఞానుల వల్ల వ్రాయబడిన జీవిత చరిత్రలు దేశకాలాదులను తెలుపక, అపభ్రంశ రూపాలతో నిండిన జంగము కథలు, పవాడాలు, సుద్దులు దేశమంతట నిండినవి. అవి జీవిత చరిత్రలె కాని బహు లోప భూయిష్టముగానున్నవి.

మన తెనుగులో కొన్ని జీవిత చరిత్రలు కానవచ్చుచున్నవి. కృష్ణరాయ విజయము, నరపతి విజయము, కైఫియత్తులు, ప్రతాప చరిత్రము మున్నగునవీ వర్గములో చేరును. కాని ఇవి వ్రేళ్ళమీది లెక్కలోనివి, ఇవికూడా లోపాలకు గురియెనవి.