Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జీవిత చరిత్రలు - వాటి రచన

జీవిత చరిత్రలకూ దేశచరిత్రలకూ సన్నిహిత సంబంధం కలదు. మహా పురుషులే దేశ చరిత్రలకు ముఖ్యకారకులు. ఒక్కొక్క మహాపురుషుడు తన శక్తి చేత గొప్ప భూభాగమునే కాక ఖండాలనే మార్చిపోయినాడు. ఏసుక్రీస్తు, మహమ్మదు, బుద్దుడు గొప్ప మత పరివర్తనము కావించి పోయినట్టివారు. అలెగ్జాండరు, హానిబాల్‌, నెపోలియన్‌ చక్రవర్తి, అశోకుడు మరొక వర్గానికి చేరినట్టివారు. వారు శూరులును, సాహసికులునునై యుండిరి, కొలంబసు, కుక్‌, వాస్కోడిగామా వంటి నావికులు కూడా ప్రపంచముపై తమ ప్రభావము వేసిపోయిరి. కొలంబసు తేరకు తేరగా అమెరికాను స్పెయిను కిచ్చెను. కుక్‌ అనువాడు ఆస్ట్రేలియాను చూడబోయి అచ్చట ఇంగ్లీషు జండాపాతి ఇది మాది అనెను. వాస్కోడిగామా ఇండియాకు దారితీసే పాశ్చాత్యులకు ఇండియాను అప్పగించుటకు పాటుపడెను. వాట్‌, స్టీవెన్సన్‌, గూటెన్‌ బర్గు, రైటు సోదరులు మున్నగు వారు చాలా గొప్పవారు. వారు రసాయనాది శాస్త్రాలలో ప్రవీణులై రైళ్ళు, ఇంజనులు, అచ్చుయంత్రాలు, విమానాలు మున్నగునవి కనుగొని ఏషియా, ఆఫ్రికా ఖండాల ఆర్థిక విజయమునకు కారకులైరి.

పై విషయాలను బట్టి మతకర్తలు, సేనానులు, రాజులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు వీరందరూ చారిత్రక పురుషులని విశదమగును. వారిని ఆదర్శముగా తీసుకొని తర్వాతి కాలములో క్రొత్తవారు బయలుదేరి ప్రపంచ కళ్యాణమునకు తోడ్పడుట కవకాశమేర్పడును. జీవిత చరిత్రలు నీతిని బోధించును. మన పూర్వుల మంచి చెడ్డలను తెలుసుకొని మనము వాటివల్ల లాభం పొందగలము.

జీవిత చరిత్రలు వ్రాయుటలో గ్రీకులో ప్రథమంలో క్రీస్తునకు పూర్వమందే క్షణఫ్‌ అనునతడు సోక్రటీసు చరిత్రను వ్రాసెను. ప్లూటార్‌ అనునతడు 46 మంది గ్రీసు రోముదేశాల మహాపురుషుల జీవితమును వ్రాసెను. గ్రీకుల తర్వాత జీవిత చరిత్రలు వ్రాయుటలో రోమువారు ప్రసిద్ధులు.