Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్లెపాటలు

స్కాట్లండు దేశీయుడు ఆండ్రూ ప్లెచర్‌ అనునతడు క్రీ. శ. 1203లో ఇట్లన్నాడు. “ప్రతి జాతియొక్క జానపదములు ఆ జాతియొక్క శాసనాలకన్నను ముఖ్యమైనవి.” యూరపు దేశములో పల్లెపాటల ప్రాముఖ్యమును ఏండ్ల క్రిందట గుర్తించిరి. మనవారు 2000 ఏండ్లకు పూర్వమే గుర్తించి మధ్యకాలములో అదంతా మరచిపోయి యిప్పుడు మళ్ళీ పాశ్చాత్యులను జూచి పునరుద్దరించుకొను ప్రయత్నము చేస్తున్నారు.

సంస్కృతములో అనేక విధాల పాటలుండెడివి. రత్నావళి వంటి నాటకాలలో కొన్ని మనకు నిదర్శనాలు దొరుకుచున్నవి. గీత గోవిందములోని పాటలు భక్తి శృంగార రసములతో కూడినవి. పూర్వము సంస్కృతములో చాలా విధములగు పాటలుండినట్లు కాళిదాసాదుల వర్ణనల వలన తెలియవస్తున్నది.


శ్లో॥ ఇక్షుచ్ఛాయ నిషాదిన్య
      స్తస్య గోప్తుర్గుణోదయం
      ఆ కుమార కథోద్ఘాతం
      శాలిగోప్యో జగుర్యశః ॥
                                        రఘువంశము-4-20


వరి పైరును కావలికాచే స్త్రీలు ప్రక్కన నుండిన చెరకు చేలలో చెరకు గడల నీడలలో కూర్చుని రఘు మహారాజు చరిత్రను పాటలుగా పాడుకొని కాలము గడిపిరి అని కవి వర్ణించినాడు. రఘు మహారాజు కాలములో పొలము కాచువారు పాటలు పాడుకొనుచుండిరని స్పష్టమైనది.


శ్లో॥ శరైరుత్సవ సంకేతాన్‌
     సకృత్యా విరతోత్సవాన్‌
     జయోదాహరణం బాహ్వోర్గా
     పయామాస కిన్నరాన్‌
                                             రఘువంశము 4-28